Ed Files Chargesheet Against Journalist Rana Ayyub In Money Laundering Case - Sakshi
Sakshi News home page

విరాళాల పేరుతో మోసం! రాణా అయ్యుబ్‌కు ఈడీ షాక్‌

Oct 13 2022 2:51 PM | Updated on Oct 13 2022 3:42 PM

రాణా అయ్యుబ్‌పై ఈడీ ఛార్జ్‌షీట్‌ - Sakshi

కెట్టో అనే ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం ద్వారా మూడు క్యాంపెయిన్‌లను నిర్వహించి రాణా అయ్యుబ్ కోట్ల రూపాయాలు వసూలు చేశారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

లక్నో: ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయ్యుబ్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఛారిటీ పేరుతో ప్రజల నుంచి నిధులు సేకరించి ఆమె మోసానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారు. 2021లో ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన ఓ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా గాజియాబాద్‌ కోర్టులో బుధవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కెట్టో అనే ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం ద్వారా మూడు క్యాంపెయిన్‌లను నిర్వహించి రాణా అయ్యుబ్ కోట్ల రూపాయాలు వసూలు చేశారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. మురికివాడల్లోని నివాసితులు, రైతుల కోసం మొదటిసారి 2020 ఏప్రిల్‌-మే మధ్యకాలంలో, అస్సాం, బిహార్, మహాష్ట్ర రిలీఫ్ పేరుతో రెండోసారి 2020 జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో, కోవిడ్ సాయం కోసం 2021 మే-జూన్‌ మధ్యకాలంలో మూడోసారి రాణా అయ్యుబ్ విరాళాలు సేకరించినట్లు పేర్కొంది.

ఈ మూడు క్యాంపెయిన్‌ల ద్వారా రాణా అయ్యుబ్ మొత్తం రూ.2.69కోట్లు వసూలు చేశారని, అందులో రూ.80.5 లక్షలు విదేశాల నుంచి అందాయని ఈడీ అధికారులు వెల్లడించారు. అయితే ఐటీ శాఖ విదేశీ విరాళాలపై విచారణకు ఆదేశించగానే ఆ డబ్బునంతా రాణా అయ్యుబ్ తిరిగి దాతలకే పంపారని వివరించారు. ఈ.2.69 కోట్లను ఆమె అక్రమంగానే సేకరించారని పేర్కొన్నారు.

విరాళాల రూపంలో సేకరించిన నిధులలో రూ.50లక్షలు రాణా అయ్యుబ్ తండ్రి, సోదరి ఖాతాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె వాటిని తన ఖాతాలోకి మళ్లించింది. రూ.29లక్షలు మాత్రం ఛారిటీ కోసం ఉపయోగించినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాణా అయ్యుబ్‌కు చెందిన రూ.1.77కోట్లను ఈడీ అటాచ్ చేసింది. అందులో రూ.50లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ కూడా ఉంది.
చదవండి: జమ్ములో వివాదాస్పద ఉత్తర్వుల ఉపసంహరణ

Advertisement
 
Advertisement
Advertisement