భారీగా తరలివచ్చిన ఓటర్లు
78.12% ఓటింగ్ నమోదు
పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్న ఈసీ
తిరువనంతపురం: కేరళ 16వ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 78.12% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నేత సతీశన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ తదితరులున్నారు.
ఉదయం 7 గంటలకు మొదలైన సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) రతన్ యూ కేల్కర్ తెలిపారు. అక్కడక్కడా సాంకేతిక లోపాలు తలెత్తాయన్నారు. రెండు పోలింగ్ బూత్‌లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ప్రస్తుత సరళిని బట్టి చూస్తే 90 శాతం వరకు ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం మంది ఓటేయగా, ఈసారి అంతకుమించి తరలిరావడం విశేషం.
అసెంబ్లీలోని మొత్తం 140 నియోజకవర్గాల్లో 2.71 కోట్ల ఓటర్లున్నారు. 1987 ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 80.54 శాతం ఓటింగ్ నమోదైంది. మరోసారి భారీగా ఓటింగ్ నమోదు కావడంపై వివిధ పార్టీలు తమకు అనుకూలమైన విశ్లేషణలు విన్పిస్తున్నాయి. సర్ ప్రక్రియ వల్లే ఈ స్థాయిలో ఓటర్లు తరలివచ్చారని సీపీఎం నేత మోహనన్ పేర్కొన్నారు. గతంలో ఓటింగ్ శాతాలు భారీగా ఉన్నప్పుడు ఫలితాలు యూడీఎఫ్‌కే అనుకూలంగా వచ్చాయని కాంగ్రెస్ నేత దీప్తి మేరీ వర్గీస్ గుర్తు చేశారు. అయితే, ఈ దఫా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే ఓటింగ్ శాతం పెరిగినట్లు బీజేపీ నేత షైజు విశ్లేషించారు. ఇది తమ పారీ్టకి అనుకూల అంశమన్నారు.
పుదుచ్చేరిలో 89.87%
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి గురువారం జరిగిన పోలింగ్‌లో ఏకంగా 89.87 శాతం పోలింగ్ నమోదైంది. 1964లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొంది, భారత్‌లో విలీనమయ్యాక పుదుచ్చేరిలో దాదాపు 90 శాతం మంది ఓటర్లు తరలివచ్చి ఓటేయడం ఇదే మొదటిసారి. గతంలో ఇక్కడ జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలన్నిటిలోనూ ఇదే రికార్డని చీఫ్ ఎలక్టోరల్ అధికారి పి.జవహర్ తెలిపారు. ఇది చరిత్రాత్మకం, అసాధారణమని ఆయన పేర్కొన్నారు.
ఒక్క స్వల్ప ఘటన మినహా పుదుచ్చేరి, కారైకాల్ మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రారంభమైన ఉదయం 7 గంటలకే జనం పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకున్నారు. ఎండలు మండిపోతున్నా లెక్కచేయలేదు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అవకాశమి చ్చారు. సీఎం ఎన్.రంగస్వామి, లోక్‌సభ ఎంపీ వీ వైతిలింగం, డీఎంకే నేత ఆర్.శివ, హోంమంత్రి నమశ్శివాయం ఓటు వేసిన వారిలో ఉన్నారు.
అస్సాంలో 85%
మైనారిటీల ప్రాబల్యమున్న చోట్ల 90 శాతంపైనే
గువాహటి: అస్సాం అసెంబ్లీకి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల నాటికి 85.64 శాతం మంది ఓటేశారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 126 స్థానాలకు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గత 2021లో జరిగిన ఎన్నికల్లో 82.04 శాతం ఓటింగ్ నమోదైంది. 2016 శాతం అత్యధికంగా 84.72 మంది ఓటేయడం రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర ప్రజలు ఈదఫా గత రికార్డును తిరగరాయడం విశేషం. ఓ వైపు వర్షం కురుస్తున్నా జనం లెక్క చేయలేదు.
పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఈసీ పేర్కొంది. దాల్గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 95.83 శాతం మంది ఓటేయగా, అత్యల్పంగా న్యూ గువాహటిలో 72.10 మంది ఓటేశారు. మైనారిటీల ప్రాబల్యమున్న 19 నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. 2023లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలివి. గురువారం సీఎం హిమంత బిశ్వ శర్మ, భార్య, పిల్లలతో కలిసి వచ్చి కామ్‌రూప్ (మెట్రో) గారాల్ బునియాదీ స్కూల్ బూత్‌లో ఓటేశారు. జోర్హాత్‌లోని డీసీబీ స్కూల్ బూత్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఓటేశారు.
ఓటేసిన మరికొందరు ప్రముఖుల్లో కేంద్ర మంత్రి పబిత్రా మర్ఘరెటా, ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా తదితరులున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడంపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును, నయా అస్సాంను కోరుకుంటున్నారనేందుకు ఇదే సంకేతమని విశ్లేషించారు. ఓటరు శాతం భారీగా నమోదు కావడాన్ని చారిత్రక పరిణామంగా సీఎం హిమంత అభివరి్ణంచారు. ఫలితం ఇప్పటికే నిర్ణయమైపోయిందని వ్యాఖ్యానించారు. తమ పాలన పట్ల ప్రజలు సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పోలింగ్ సంబంధిత ఘర్షణల్లో 30 మంది గాయపడినట్లు ఐజీ అఖిలేశ్ కుమార్ తెలిపారు.


