
జోధ్‌పూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. ఒక మహిళతో పాటు ఆమె మూడేళ్ల ఏళ్ల కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తమ కుమార్తె కొన్నాళ్లుగా అత్తవారింటిలో వరకట్న వేధింపులను ఎదుర్కొంటున్నదని, ఈ నేపధ్యంలో ఆమె కుమార్తెతో పాటు ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
యూపీలోని గ్రేటర్ నోయిడాలో వరకట్న వేధింపులతో మహిళ హత్య జరిగిన కొన్ని రోజులకే ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాజా ఘటనలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు సంజు బిష్ణోయ్ శనివారం మహాత్మా గాంధీ ఆస్పత్రిలో కాలిన గాయాలతో మరణించగా, ఆమె మూడేళ్ల కుమార్తె యశస్వి జోధ్‌పూర్‌లోని సర్నాడ గ్రామంలోని వారి ఇంట్లో సజీవ దహనమయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంజు శుక్రవారం పాఠశాల నుండి తిరిగి వచ్చాక, ఇంటిలోని డైనింగ్ టేబుల్ కుర్చీపై పెట్రోల్ పోసి, తనతో పాటు తన కుమార్తెకు కూడా నిప్పంట్టించింది. ఇద్దరూ మంటల్లో చిక్కుకుని గాయాలపాలయ్యారు. అక్కడిక్కడే యశస్వి సజీవ దహనమైపోయింది. సంజు కాలిన గాయాలతో ఆస్పత్రిలో మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలం నుండి పెట్రోల్ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.
సంజుకు దిలీప్ బిష్ణోయ్ తో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తమ కుమార్తెను అత్తామామలు పదే పదే కట్నం కోసం వేధించారని, వాటిని తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నదని తల్లిదండ్రులు రోదిస్తూ మీడియాకు తెలిపారు. సంజుకు ఆమె అత్తమామలకు మధ్య నాలుగైదు నెలల నుంచి వివాదాలు జరుగుతున్నాయన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ సంజు బిష్ణోయ్‌ని ఆమె భర్త , అత్తమామలు కట్నం కోసం వేధించారని. ఇదే ఆమె ఆత్మత్యకు కారణంగా నిలిచిందంటూ ఫిర్యాదు అందిందన్నారు. ఈ నేపధ్యంలో భర్త దిలీప్, మామ గణపత్, అత్త లీలలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.