డీకేఎస్‌కే పట్టం  | DK Shivakumar is set to replace Siddaramaiah as Karnataka Chief Minister | Sakshi
Sakshi News home page

డీకేఎస్‌కే పట్టం 

May 28 2026 2:26 AM | Updated on May 28 2026 2:26 AM

DK Shivakumar is set to replace Siddaramaiah as Karnataka Chief Minister

నేడు కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా  

తొలుత మంత్రులు, ఎమ్మెల్యేలకు అల్పాహార విందు  

అనంతరం నేరుగా లోక్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పణ 

అనంతరం సీఎల్పీ భేటీలో నూతన సీఎం ఎంపిక  

30న శివకుమార్‌ ప్రమాణ స్వీకారం?  

సాక్షి, బెంగళూరు:  కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు జాతీయస్థాయిలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని నెలలుగా ఉత్కంఠభరితంగా మారిన ముఖ్యమంత్రి మార్పు అంశం ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి గురువారం రాజీనామా చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. 

కాంగ్రెస్‌ అధిష్టానంతో మంగళవారం సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వరుస సమావేశాల అనంతరం మంగళవారం రాత్రి బెంగళూరుకు తిరిగివచ్చారు. బుధవారం మీడియా సమావేశం నిర్వహించి తన రాజీనామాను ప్రకటిస్తారని వార్తలొచ్చాయి. కానీ, మీడియా సమావేశాన్ని గురువారానికి వాయిదా వేసుకున్నారు. 

చివరిసారిగా ముఖ్యమంత్రి హోదాలో తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు గురువారం ఉదయం 8.45 గంటలకు అల్పాహార విందు ఇవ్వబోతున్నారు. అనంతరం 10.30 గంటలకు లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌కు తన రాజీనామా లేఖను అందిస్తారు. సీఎం రాజీనామా తర్వాత కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. 

ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్‌ సుర్జేవాలా కూడా పాల్గొంటారు. పార్టీ హైకమాండ్‌ తీర్మానాన్ని ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. నూతన శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. అధిష్టానం సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ను సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకోనున్నట్లు సమాచారం. సీఎల్పీ ఆమోదం అనంతరం ఆ నిర్ణయాన్ని గవర్నర్‌కు తెలియజేస్తారు. నూతన ముఖ్యమంత్రిగా డి.కె.శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమేనని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.   

రాష్ట్ర ప్రజలకు వీడ్కోలు సందేశం  
ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేస్తారన్న వార్తలను ఆయన వర్గం నేతలు, అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై స్పష్టత కోరుతూ ఆయన ఇంటికి పరుగులు పెట్టారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను కలుసుకొని తదుపరి కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుత పరిణామాలపై వారంతా ఆందోళన వ్యక్తం చేయగా, సిద్ధరామయ్య మాత్రం మౌనం వహించినట్లు సమాచారం. రాజీనామా చేయవద్దని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ సిద్ధరామయ్య స్పందించకుండా మిన్నకుండిపోయారు. బుధవారం ఆయన ‘ఎక్స్‌’లో చేసిన ట్వీట్‌ హాట్‌టాపిక్‌గా మారింది.

 సీఎంగా తన వీడ్కోలు సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. కర్ణాటక ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్నట్లు, ఈ సమయంలో తమ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్‌ హామీలతో పాటు అనేక ప్రజాకర్షక పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ఈ విజయాన్ని ప్రతి ఒక్క కన్నడిగుడికి అంకితం ఇస్తున్నామని వెల్లడించారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో అన్నభాగ్య పథకాన్ని తీసుకొచ్చినట్లు ఉద్ఘాటించారు. ఢిల్లీలో హైకమాండ్‌తో జరిగిన సమావేశం, చర్చల వివరాలను గురువారం వెల్లడిస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.  

ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ఆరంభం  
ప్రమాణ స్వీకార శుభ ముహూర్తం కోసం డి.కె.శివకుమార్‌ సన్నిహితులు ఇప్పటికే పురోహితులను సంప్రదించినట్లు తెలిసింది. శివకుమార్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు ఆరంభమయ్యాయి. బెంగళూరు కంఠీరవ స్టేడియం లేదా విధానసౌధ ముందు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి బెంగళూరుకు చేరుకోగా, డి.కె.శివకుమార్‌ మాత్రం బుధవారం కూడా అక్కడే మకాం వేశారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకొని, సిద్ధరామయ్య ఇచ్చే అల్ఫాహార విందులో ఆయన పాల్గొంటారు. సీఎం మార్పు నిర్ణయంపై కాంగ్రెస్‌ అధిష్టానం వెనక్కి తగ్గకుండా జాగ్రత్త పడేందుకు డి.కె.శివకుమార్‌ఢిల్లీలోనే ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 30న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement