మే 31.. డబుల్‌ హిస్టారిక్‌ డే! | DK Shivakumar IPL Link, Is May 31st Double Historic Day For Karnataka Spark Massive Buzz, Check Story Inside | Sakshi
Sakshi News home page

మే 31.. డబుల్‌ హిస్టారిక్‌ డే!

May 28 2026 10:57 AM | Updated on May 28 2026 11:09 AM

DK Shivakumar IPL Link: Is May 31st Double Historic Day For Karnataka

మే 31.. ఆదివారం.. కర్ణాటక చరిత్రలో కీలక మలుపు దిశగా సాగే తేదీగా మారింది. ఒకవైపు క్రికెట్‌ ప్రపంచంలో ఉత్కంఠభరిత ఫైనల్‌, మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో పవర్‌ షిఫ్ట్‌.. ఈ రెండు భిన్న ప్రపంచాల్లోనూ ఒకే రోజు చర్చకు కేంద్రబిందువుగా నిలుస్తోంది.

కర్ణాటక రాజకీయాల్లో ఆ తేదీ కొత్త చరిత్రకు వేదికగా మారుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ 31నే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే ప్రచారం నడుస్తోంది(అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది).

డీకే శివకుమార్‌ రాజకీయ ప్రస్థానం చూస్తే ఇది ఒక దీర్ఘ ప్రయాణానికి ఫలితంగా చెప్పొచ్చు. కాంగ్రెస్‌ పార్టీకి సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. “కట్టె కాలేదాకా కాంగ్రెస్‌తోనే ఉంటాను” అనే ఆయన మాటలు ఆ నిబద్ధతను చెబుతాయి. 2023లోనే ఆయన సీఎం పదవికి అర్హుడిగా ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణాల కారణంగా అవకాశం వాయిదా పడింది. ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు లభించబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటు కర్ణాటకకు చెందిన ఆర్సీబీ జట్టు అభిమానులు మే 31వ తేదీ కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. ఆరోజు ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉంది. గత సీజన్‌లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికి ఆ జట్టు తొలి ఐపీఎల్‌ కప్పును సాధించింది. జట్టు సభ్యుడు, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ జెర్సీ నెంబర్‌ కూడా 18 కావడంతో ఆ విజయం మరింత భావోద్వేగంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఫైనల్‌ చేరడంతో అదే మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

ఒకవైపు క్రీడా ప్రపంచంలో 18 ఏళ్ల కల నెరవేరిన కథ మళ్లీ రిపీట్‌ అవుతుందా అనే ఆశ, మరోవైపు దశాబ్దాల రాజకీయ ప్రయాణం చివరికి శిఖరాన్ని చేరబోతున్న క్షణం.. ఇవన్నీ కలిసి మే 31ను  “డబుల్‌ హిస్టారిక్‌ డే”గా నిలబెడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement