
న్యూఢిల్లీ: పదిహేనేళ్ల ఓ బాలుడిపై కొందరు కత్తితో దాడి చేశారు. ఛాతీలో దిగబడిన కత్తితో రక్తమోడుతూనే అతడు పోలీస్ ఠాణాకు చేరుకున్నాడు. వెంటనే పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి, ఛాతీలో దిగి ఉన్న కత్తిని విజయవంతంగా తొలగించి, బాలుడి ప్రాణాలు కాపాడారు. విచారణ జరిపిన పోలీసులు నిందితులైన ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన ఢిల్లీలోని పహార్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సుమారు 15 రోజుల క్రితం నిందితుల్లో ఒకరిని కొందరు బాలురు కొట్టారు. దీని వెనుక ఉన్నది బాధిత బాలుడేనని నిందితుల అనుమానం. ఇదే కారణంతో ఆ బాలుడిని స్కూలు వద్ద ముగ్గురూ అడ్డుకున్నారు. పగిలిన బీర్ బాటిల్‌తో పొడుస్తానంటూ ఒకడు బెదిరించగా, అదే సమయంలో మరొకడు కత్తితో ఛాతీపై పొడిచాడు. ఆ వెంటనే బాలుడు పహార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు రాగా, పోలీసులు కేసు నమోదు చేశారు. మరికొన్ని గంటల్లో ఆరాంబాగ్ ప్రాంతంలో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు వాడిని కత్తిని, పగిలిన బాటిల్‌ను స్వా«దీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.