కిసాన్‌ పరేడ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

Delhi Police allows farmers tractor rally in capital on Republic Day - Sakshi

రెచ్చగొట్టే రాతలున్న పోస్టర్లు ప్రదర్శించొద్దు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలకు భంగం కలిగించకుండా కిసాన్‌ గణతంత్ర పరేడ్‌ నిర్వహించుకోవచ్చని ఢిల్లీ పోలీసులు ఆదివారం సాయంత్రం చెప్పారు. రైతుల డిమాండ్ల పట్ల ఉన్న గౌరవంతోనే ఈ కార్యక్రమానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. రైతులు మంగళవారం ఢిల్లీ నగరంలోకి ప్రవేశించవచ్చని, అయితే, గణతంత్ర దినోత్సవాలకు ఎలాంటి విఘాతం కలిగించరాదని షరతు విధించారు. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. రైతులు వాటిని కచ్చితంగా పాటించాలన్నారు. రాజ్‌పథ్‌లో పరేడ్‌ ముగిసిన తర్వాతే రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌ ప్రారంభమవుతుందన్నారు. పోలీసు అధికారులు తాజాగా రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు.

శాంతియుతంగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని నేతలు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. ట్రాక్టర్‌ ర్యాలీకి అనుమతిపై తుది నిర్ణయం ఢిల్లీ పోలీసులదే అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ర్యాలీ కోసం పోలీసులు బహుళ మార్గాలను సూచించారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ బోర్డర్‌ పాయింట్ల నుంచి బయలుదేరే ట్రాక్టర్లు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించి, కూండ్లీ మానేసర్‌ పాల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే వద్ద కలుసుకుంటాయని వెల్లడించారు. ర్యాలీ సందర్భంగా జాతి వ్యతిరేక నినాదాలు చేయరాదని, అనుచితమైన, రెచ్చగొట్టే రాతలతో కూడిన పోస్టర్లు ప్రదర్శించరాదని ఆంక్షలు విధించారు. రైతు సోదరులపై తమకు నమ్మకం ఉందని, కిసాన్‌ గణతంత్ర పరేడ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తారని విశ్వసిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ట్రాక్టర్‌ పరేడ్‌పై పాక్‌ కుతంత్రం
రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ పరేడ్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్‌ కుట్రలు పన్నుతున్నట్లు ఢిల్లీ పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ పరేడ్‌పై రెచ్చగొట్టే ప్రచారం సాగించి, ప్రజలను తప్పుదోవ పట్టించి, తద్వారా హింసను ప్రేరేపించడానికి పాకిస్తాన్‌లో జనవరి 13 నుంచి 18వ తేదీ వరకు 300 ట్విట్టర్‌ ఖాతాలను సృష్టించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరేడ్‌ ప్రశాంతంగా జరగడానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాక్టర్‌ పరేడ్‌ విషయంలో పుకార్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని ప్రజలకు సూచించారు.  

ట్రాక్టర్‌ పరేడ్‌లో రైతు శకటాలు
ట్రాక్టర్‌ పరేడ్‌లో శకటాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. గ్రామీణ జీవితం, సంప్రదాయ, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పశు పోషణ, మహిళా రైతుల భాగస్వామ్యం, భారత్‌లో రైతు ఉద్యమాల చరిత్ర, రైతన్నల ఆత్మహత్యలు, కొత్త సాగు చట్టాల వల్ల జరిగే నష్టాలు తదితర కీలక అంశాలను ప్రతిబింబించే శకటాలు పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా మారనున్నాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు తరలివస్తాయని, ఇందులో 30 శాతం శకటాలే ఉంటాయని పేర్కొన్నారు.  
► మహారాష్ట్రలోని విదర్భలో రైతుల ఆత్మహత్యలు అధికం. ఈ అంశంపై శకటం రూపొందించేందుకు ఆ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలు సన్నద్ధమవుతున్నారు.  
► ప్రతి ట్రాక్టర్, శకటంపై మూడు రంగుల జాతీయ జెండా ఉంటుంది.  
► ట్రాక్టర్‌ పరేడ్‌లో రైతులను ఉత్తేజపర్చడానికి జానపద, దేశభక్తి గీతాలను వినిపిస్తారు.  
► ట్రాక్టర్‌ ర్యాలీని సమన్వయం చేసుకోవడానికి ప్రతి నిరసన ప్రాంతం వద్ద ఒక వార్‌రూమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో వార్‌రూమ్‌లో 40 మంది సభ్యులను నియమిస్తున్నారు. వీరిలో డాక్టర్లు, సెక్యూరిటీ –సిబ్బంది, సోషల్‌ మీడియా మేనేజర్లు ఉంటారు.  
► ట్రాక్టర్‌ పరేడ్‌ జరిగే మార్గంలో వేర్వేరు చోట్ల 40 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుతారు. ర్యాలీలో పాల్గొనేవారు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సేవలు అందిస్తారు.  
► మెకానిక్‌ల బృందాన్ని కూడా రంగంలోకి దించుతున్నారు. ర్యాలీలో ఎక్కడైనా వాహనం ఆగిపోతే వెంటనే మరమ్మతు చేస్తారు.  
► వలంటీర్లకు బ్యాడ్జ్‌లు, గుర్తింపు కార్డులు అందజేస్తారు.  
► భద్రతను పర్యవేక్షించడానికి మాజీ సైనికుల సేవలను వాడుకోనున్నారు.   
► వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైతులు ఢిల్లీ నగరంలోకి ప్రవేశించడానికి వీలుగా సింఘు, టిక్రీ బోర్డర్‌ పాయింట్ల వద్ద బారికేడ్లను తొలగించడానికి పోలీసులు అంగీకరించారు.   

రివర్స్‌గేర్‌లో పంజాబ్‌ నుంచి ఢిల్లీకి..
ఢిల్లీలో జనవరి 26న ర్యాలీలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లపై తరలివస్తున్నారు. వివా దాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌కు చెందిన ఓ
రైతు ట్రాక్టర్‌ను రివర్స్‌ గేర్‌లో వెనక్కి నడుపుతూ ఢిల్లీకి బయలుదేరాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

రివర్స్‌ గేర్‌లో వెళ్తున్న ట్రాక్టర్‌

నేడు ముంబైలో భారీ ర్యాలీ
ముంబై: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించేందుకు రంగం సిద్ధమయ్యింది. రైతుల ర్యాలీ జరిగే ఆజాద్‌ మైదాన్‌లో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్, అధికార మహా వికాస్‌ అఘాడీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొని, రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రైతు సంఘాల నాయకులు రాజ్‌భవన్‌కు చేరుకొని గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తారు. సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని కోరుతారు. రైతుల పోరాటానికి ఎంవీఏ భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. ర్యాలీలో పాల్గొనే అన్నదాతలకు ఆహారం సరఫరా చేసేందుకు కార్మిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. సం యుక్త షేట్కారీ కామ్‌గార్‌ మోర్చా ఆధ్వర్యంలో ఆజాద్‌ మైదాన్‌లో జనవరి 26వ తేదీ వరకు బైఠాయించాలని, గణతంత్ర దినో త్సవం సందర్భంగా అక్కడే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు.

ముంబైలో ఆదివారం జరిగిన ర్యాలీ దృశ్యం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top