ఢిల్లీలో మరోసారి మేయర్‌ ఎన్నిక!.. పోటీకి బీజేపీ దూరమా?

Delhi Having Another Mayor Election in April This Is The Reason - Sakshi

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవికి ఈ నెలలోనే మరోసారి ఎన్నిక జరగనుంది. నాటకీయ పరిణామాలతో దాదాపు రెండు నెలల్లో మూడుసార్లు వాయిదా పడిన ఎన్నిక.. ఫిబ్రవరి చివరివారంలో జరిగిన సంగతి తెలిసిందే. ఆప్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ ఆ ఎన్నికలో మేయర్‌గా విజయం సాధించారు కూడా. అయితే.. 

ఏప్రిల్‌లో ఎంసీడీ(Municipal Corporation of Delhi)కి మరోసారి ఎన్నిక జరగాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు కారణం ఏంటంటే.. 

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ ప్రకారం.. మార్చి 31వ తేదీతో ఎంసీడీ హౌజ్‌ కాలపరిమితి ముగుస్తుంది. కాబట్టి, మళ్లీ ఎన్నికలు నిర్వహించి కచ్చితంగా ఆ సమయంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. 

ఆప్‌ తరపున ప్రస్తుత మేయర్‌ షెల్లీ ఒబెరాయ్‌నే మళ్లీ మేయర్‌ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే డిప్యూటీ మేయర్‌ పోస్ట్‌కు ఆప్‌ నుంచి మహమ్మద్‌ ఇక్బాల్‌ బరిలో దిగే ఛాన్స్‌ కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ మళ్లీ మేయర్‌ పదవికి అభ్యర్థులను బరిలో దింపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇంతకు ముందు నిలబెట్టిన రేఖా గుప్తా కాకుండా వేరే వ్యక్తిని నిలపాలని భావిస్తోందని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పోస్టులతో పాటు స్టాండింగ్‌ కమిటీ, వార్డ్‌ ఎన్నికలు.. ఇలా అన్నీ ఏప్రిల్‌లోనే జరగనున్నాయి. ఈ మేరకు మేయర్‌ కార్యాలయం, ఎన్నికల ప్రతిపాదనను మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయానికి పంపుతుంది. అక్కడి నుంచి స్టేట్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌కు, అటు నుంచి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయానికి ఎన్నికల ప్రతిపాదిత ఫైల్‌ వెళ్తుంది. ఎల్జీ మేయర్‌ ఎన్నికలకు ప్రిసైడింగ్‌ అధికారిని నియమిస్తారు. 

పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో.. 134 ఆప్‌, బీజేపీ 104 స్థానాలు దక్కించుకున్నాయి. మేయర్‌ ఎన్నిక పోలింగ్‌లో 34 ఓట్ల తేడాతో షెల్లీ ఒబెరాయ్‌ గెలిచారు. ఢిల్లీ మున్సిప‌ల్ హౌజ్‌లో జ‌రిగిన పోలింగ్‌లో.. బీజేపీకి 116 ఓట్లు పోల‌వ్వ‌గా.. ఆప్‌కు 150 ఓట్లు ప‌డ్డాయి. 

ఇక ఢిల్లీ మేయర్‌ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్‌ చేశారు. రెండో ఏడాది ఓపెన్‌ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్‌ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్‌ కేటగిరీ కింద మేయర్‌ అభ్యర్థిని ఎన్నుకుంటారు. 

ఇదీ చదవండి: ఢిల్లీ మేయర్‌ ఓటింగ్‌: సీక్రెట్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌.. ఏదైనా జరగొచ్చు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top