న్యూఢిల్లీ: ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో భవనం కూలిన ఘటన ఒక కుటుంబంలోనే కాకుండా, అక్కడి విద్యార్థులకూ తీరని విషాదాన్ని పంచింది. ఈ ఘటన అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను కాపాడాలనే ప్రయత్నంలో ప్రమాద స్థలంలోకి వెళ్లిన పార్వతీ ఓజా (50) ప్రాణాలు కోల్పోయారు.
విద్యార్థులకు ‘పార్వతీ ఆంటీ’
ఢిల్లీలోని సైదులాబాద్ ప్రాంతంలో ‘ఆంటీ వాలా కిచెన్’ నడుపుతున్న పార్వతి అక్కడి విద్యార్థులకు కేవలం ఆహారాన్ని అందించడమే కాకుండా, ఒక తల్లి చూపించే ఆప్యాయతను కూడా పంచేవారు. హోమ్లీ ఫుడ్‌తో పాటు ఆమె చూపే ప్రేమ కారణంగా పలువురు విద్యార్థులు ఆమెను ‘పార్వతీ ఆంటీ’ అని పిలుచుకునేవారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో కూడా ధరలు పెంచకుండా, విద్యార్థులకు ఆమె చక్కని ఆహారం అందించారని స్థానికులు చెబుతుంటారు.
ప్రాణాలకు తెగించి..
ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన సమయంలో పార్వతి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ లోపల విద్యార్థులు చిక్కుకున్నారని తెలియగానే, వారిని రక్షించేందుకు ఆమె లోనికి వెళ్ళారు. అదే సమయంలో భవనం పూర్తిగా కుప్పకూలడంతో ఆమె శిథిలాల కింద చిక్కుకుపోయారు. 16 గంటల సుదీర్ఘ సహాయక చర్యల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనలో ఆమెతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ దుర్ఘటన ఢిల్లీలో అక్రమ కట్టడాల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. తనిఖీలు లేని భవనాలు ఎలా మరణశాసనంగా మారుతున్నాయనే దానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.


