ధరల పెరుగుదల, పేపర్‌ లీకేజీలపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఉద్యమం | Congress plans nationwide protest on inflation, NEET paper leak | Sakshi
Sakshi News home page

ధరల పెరుగుదల, పేపర్‌ లీకేజీలపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఉద్యమం

Jun 12 2026 5:20 AM | Updated on Jun 12 2026 6:20 AM

Congress plans nationwide protest on inflation, NEET paper leak

మూడు నెలలపాటు కొనసాగే అవకాశం 

న్యూఢిల్లీ: పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకేజీలు, ఎన్నికల్లో అవకతవకలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ సిద్ధమైంది. ప్రభుత్వం తీరును ఎండగడుతూ జూన్‌ చివర్లో దేశవ్యాప్త నిరసన ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గురువారం ఇందిరా భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. 

సమావేశంలో రాహుల్‌ గాందీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌ జైరాం రమేశ్, భూపేశ్‌ బఘెల్‌లతోపాటు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఈ భేటీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘నీట్, సీబీఎస్‌ఈ వంటి పరీక్షల పత్రాల లీకేజీలను అరికట్టేందుకు రెండేళ్ల క్రితమే చట్టం చేసిన కేంద్రం పకడ్బందీగా అమలు చేయలేకపోయింది. ఫలితంగానే లీకయ్యాయి. 

అదేవిధంగా, ఈ నెల 22న అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నిటినీ రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు’అని జైరాం రమేశ్‌ చెప్పారు. ‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న డబుల్‌ ఇంజన్‌. ఇందులో ఒక ఇంజన్‌ ఓట్‌ చోరీ కాగా, మరోటి సీట్‌ చోరీ’అని ఆయన పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పరీక్షల కుంభకోణాలు, సామాజిక అసమానతలు వంటి తీవ్ర సమస్యలను దేశం నేడు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. 

దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన వ్యవస్థలను మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చిందని ఆరోపించారు. దేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం రాజకీయ పోరాటం సాగించడటం తమ బాధ్యతని ఖర్గే వివరించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో మొదలయ్యే తమ దేశవ్యాప్త పోరాటం రెండు, మూడు నెలలపాటు కొనసాగుతుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలకు దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement