
న్యూఢిల్లీ: రాజధానిలో మహిళలకు భద్రత కరువవుతున్నదనే మాట తరచూ వినిపిస్తుంటుంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ వాకింగ్‌కు వెళుతూ చైన్ స్నాచర్ బారిన పడ్డారు. ఢిల్లీలోని చాణక్యపురిలో ఉదయం నడకకు వెళుతుండగా ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ ప్రాంతంలో భారీ భద్రత ఉన్నప్పటికీ, ఆమె మెడలో నుంచి చైన్ లక్కెళ్లిన దొంగ అత్యంత చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
ఈ సంఘటన తమిళనాడు భవన్ సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. తమిళనాడు భవన్ నుండి ఎంపీ సుధ.. మరో మహిళా పార్లమెంటు సభ్యురాలు రాజతి వాకింగ్‌కు వెళుతూ, రాయబార కార్యాలయం సమీపంలో ఉన్నప్పుడు ఒక స్కూటీపై వచ్చిన ఒక వ్యక్తి ఎంపీ సుధ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆ సమయంలో అతను హెల్మెట్ ధరించి ఉండటంతో ఇద్దరు ఎంపీలు అతనిని గుర్తించలేకపోయారు. ఈ ఘటనలో ఎంపీ మెడకు గాయాలయ్యాయి.