డీకే శివకుమార్‌కు సీఎం పీఠం.. ఒకే దెబ్బకు రెండు లక్ష్యాలు! | Congress message to Siddaramaiah Key Role In National Level | Sakshi
Sakshi News home page

డీకే శివకుమార్‌కు సీఎం పీఠం.. ఒకే దెబ్బకు రెండు లక్ష్యాలు!

May 31 2026 8:14 AM | Updated on May 31 2026 8:42 AM

Congress message to Siddaramaiah Key Role In National Level

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో భారీ రాజకీయ మార్పునకు తెరలేచింది. కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు నాయకత్వ మార్పుపై నిర్ణయం తీసుకోవడంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న సీఎం పదవి రేసుకు ఇది ముగింపు పలికినట్లైంది. అయితే, ఈ పరిణామం సాధారణ సీఎం మార్పు కంటే చాలా పెద్ద రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ప్రధాన పోటీదారులుగా నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్ఠానం రాజీ ఫార్ములా అమలు చేసి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. అప్పటి నుంచే ప్రభుత్వం సగకాలం తర్వాత సీఎం మార్పుపై రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. కాగా, శివకుమార్ కాంగ్రెస్‌కు కర్ణాటకలో అత్యంత కీలకమైన నిర్వాహక నాయకుడిగా గుర్తింపు పొందారు. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతున్న సమయంలో ఎమ్మెల్యేలను కాపాడటం నుంచి, 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకు ఆయన కీలక పాత్ర పోషించారు.

కాంగ్రెస్ హైకమాండ్‌కు చాలా కాలంగా డీకే శివకుమార్‌ను సీఎం చేయాలనే ఒత్తిడి ఉండేది. 2023లో సిద్ధరామయ్యను సీఎం చేసినప్పుడు కూడా డీకే వర్గం అసంతృప్తిగా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు నాయకత్వ మార్పు ద్వారా ఆ అసంతృప్తిని తగ్గించాలనే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో జరిగిన చర్చల అనంతరం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సీఎల్పీ సమావేశంలో ఏమైంది?
బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) సమావేశంలో సిద్ధరామయ్య స్వయంగా డీకే శివకుమార్ పేరును కొత్త నాయకుడిగా ప్రతిపాదించారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలపడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 

ఆయన మాట్లాడుతూ.. సిద్ధరామయ్య సేవలను కొనియాడారు. మీ సేవలు కేవలం కర్ణాటకకే పరిమితం కావు అనే సందేశాన్ని ఇచ్చారు. అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించాలని సిద్ధరామయ్యను కోరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో సిద్ధరామయ్యకు భవిష్యత్తులో జాతీయ స్థాయి బాధ్యతలు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఒకవైపు డీకే శివకుమార్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తూనే, మరోవైపు సిద్ధరామయ్యను జాతీయ స్థాయిలో వినియోగించాలనే సంకేతాలు కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సిద్ధరామయ్యకు ఏ పదవి రావచ్చు?

  • కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో పెద్ద బాధ్యత.

  • ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC)లో జాతీయ పదవి.

  • ఓబీసీ వర్గాల్లో పార్టీ బలోపేతానికి జాతీయ ప్రచార బాధ్యతలు ఇవ్వవచ్చు.

  • 2029 లోక్‌సభ ఎన్నికల వ్యూహరచనలో కీలక పాత్ర కల్పించవచ్చు.

  • రాజ్యసభకు పంపించే అవకాశం. అయితే, ఈ అంశాలపై కాంగ్రెస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

డీకే శివకుమార్ ముందున్న సవాళ్లు..

ఇదిలా ఉండగా.. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌కు పలు కీలక సవాళ్లు ఎదురుకానున్నాయి.

  • కాంగ్రెస్ అంతర్గత వర్గపోరును సమతుల్యం చేయడం.

  • సిద్ధరామయ్య అనుచరులను సంతృప్తిపరచడం.

  • ఐదు గ్యారంటీ పథకాల అమలు కొనసాగించడం.

  • 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయడం.

  • బీజేపీ, జేడీఎస్‌ నుంచి వచ్చే రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోవడం.

 

Advertisement
 
Advertisement
Advertisement