
ఢిల్లీ: సైనికులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భారత్ చేపట్టిన దాడుల నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ బుధవారం అత్యవసరంగా సమావేశం నిర్వహించింది.‘‘పీవోకే నుంచి ఉగ్రవాదులు పనిచేస్తున్నారనేది స్పష్టమైంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే. దేశ రక్షణ విషయంలో మనమంతా కలిసి ఉండాలి. సైనికులు తీసుకునే ప్రతి నిర్ణయానికీ మద్దతిస్తాం’’ అని ఖర్గే పేర్కొన్నారు.
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సైనిక దళాలను చూసి తాము గర్విస్తున్నామని ఖర్గే అన్నారు.
కాగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూడు రోజుల ముందే తెలుసునంటూ నిన్న(మంగళవారం) మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పర్యాటకులపై దాడి జరగబోతున్నట్లు మోదీకి ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని.. అందుకే ఆయన జమ్మూకశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. నిఘా వైఫల్యం వల్లే పహల్గాంలో ఉగ్రదాడి జరిగినట్లు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, మోదీ సైతం స్వయంగా ఒప్పుకున్నారంటూ ఖర్గే వ్యాఖ్యానించారు.