తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి కానుక

CM Edappadi Palaniswami Announces Rs 2500 To Ration Card Holders - Sakshi

చెన్నై: తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్కొక్కరుగా ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికే మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా.. డీఎంకే ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇక సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ కొత్త పార్టీపై ప్రకటన చేసేశారు. డిసెంబర్‌ 31న పార్టీ పేరు… జనవరి ఒకటిన పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఇప్పటికే రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈపీఎస్‌ పళనిస్వామి తన స్వస్థలం ఎడప్పాడిలోని సేంద్రయ్య పెరుమాళ్ల కోయిల్‌ ఆలయంలో పూజల అనంతరం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేషన్‌ కార్డు లబ్దిదారులకు సంక్రాంతి కానుకగా రూ.2500 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

సీఎం నిర్ణయంతో తమిళనాడులోకి 2.06 కోట్ల రేషన్‌కార్డు దారులు లబ్ది పొందనున్నారు. దాంతోపాటు కిలో బియ్యం, కిలో చక్కెర, ఒక చెరుకు గడ, 20 గ్రాముల కిస్‌మిస్‌, 20 గ్రాముల జీడిపప్పు, 5 గ్రాములుయాలకులు కూడా ఉచితంగా అందివ్వనున్నట్టు సీఎం తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి ప్రకటనపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విమర్శలు చేశారు. వరదల సమయంలో ప్రజలు కష్టాల్లో​ఉన్నప్పుడు ఎటువంటి సాయం అందించని సీఎం, ఎన్నికలు సమీపిస్తుండటంతో వరాలు కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్‌, వరదల కారణంగా ప్రభావితమైన కుటుంబాలకు రూ.5000 చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే, స్టాలిన్‌ విమర్శలపై స్పందించిన సీఎం పళనిస్వామి.. రేషన్‌ కార్డుదారులకు సంక్రాంతి సందర్భంగా 2014లో రూ.100, కిలో బియ్యం, కిలో చక్కెర ఇచ్చామని, 2018లో ఆ మొత్తాన్ని రూ.1000కి పెంచామని తెలిపారు. దానిలో భాగంగానే ఇప్పుడు రూ.2500 ఇస్తున్నామని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top