
గంటలోనే 10 సెం.మీ.పైగా భారీ వర్షం
తీవ్ర విషాదం మిగులుస్తున్న క్లౌడ్ బరస్ట్
తుడిచిపెట్టుకుపోతున్న గ్రామాలు
పర్వత ప్రాంతాల్లోనే దుర్ఘటనలు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరలీ గ్రామం ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. పర్వతం నుంచి కిందికి వచ్చిన వినాశకర వరద నీరు, బురద, రాళ్లు.. ఆ గ్రామం నామరూపాలు లేకుండా చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 50 మందికిపైగా జాడ కానరావడం లేదు. దీనంతటికీ కారణం.. మేఘ విస్ఫోటం. ఆకాశంలో అపార జలరాశిని నింపుకొన్న మేఘాలు.. కేవలం స్వల్ప వ్యవధిలో కుంభవృష్టిగా విజృంభించడం. ఆ విస్ఫోటంతో విలయం సంభవించింది. దీన్నే క్లౌడ్ బరస్ట్.. మేఘ విస్ఫోటం అంటారు. ఉత్తరాఖండ్ వీటికి ప్రసిద్ధి. – సాక్షి, స్పెషల్ డెస్క్
మేఘ విస్ఫోటం.. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెబుతోంది. గాలి పయనించే తీరు, ఎతై ్తన పర్వతాలు, గాలిలోని తేమ ఇందుకు ప్రధాన కారణాలు. వేడిగాలి పర్వత ప్రాంతాలపైకి వెళ్లి అక్కడ అల్పపీడనం వల్ల చల్లబడి తేమను విడుదల చేస్తుంది. వేడిగాలి ఎంత ఎక్కువగా పైకి వెళితే తేమ అంత అధికమై.. అదే ఒక్కసారిగా క్లౌడ్‌బరస్ట్ రూపంలో వర్షిస్తుంది. చాలా తక్కువ వ్యవధిలో భారీ వర్షం నమోదు కావడంతో ఆకస్మిక వరదలకు దారితీస్తుంది. క్లౌడ్ బరస్ట్ కాకున్నా దాదాపు అలాంటి పరిస్థితిని ఇటీవల హైదరాబాద్‌లోనూ చూశాం.
ముందే చెప్పలేరా?
వాతావరణ శాఖ.. వర్షం పడుతుందని చెప్పగలదు. సాధారణ, భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పగలదు. కానీ ఎంత మొత్తంలో వర్షపాతం నమోదవుతుందనేది మాత్రం చెప్పలేదు.
10 సెం.మీ. వర్షపాతం
ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక గంట సమయంలో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్‌గా పరిగణిస్తామని ఐఎండీ చెబుతోంది. దీన్ని ముందే పసిగట్టాలంటే ఆ నిర్దిష్ట ప్రాంతంలో పటిష్ట రాడార్ నెట్‌వర్క్ లేదా వాతావరణాన్ని అంచనావేసే అధునాతన సాంకేతిక వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది.
కేదార్‌నాథ్ విలయం
క్లౌడ్‌బరస్ట్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే సంఘటన 2013లో ఉత్తరాఖండ్ విలయం. ఈ ఘటనలో 6,074 మంది చనిపోగా 70 వేలకుపైగా చార్‌ధామ్ యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. 2004 సునామీ తర్వాత ఇదే అతిపెద్ద ప్రకృతి విపత్తు.
అక్రమ, అశాస్త్రీయ నిర్మాణాలు..: హిమాలయాలలో అక్రమంగా, అశాస్త్రీయంగా చేపట్టిన నిర్మాణాల వల్ల ఇలాంటి విపత్తుల సమయంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయ భూభాగంలో లోయ వైపున ఉన్న చాలా కాలువలు బలహీన ప్రాంతం, విరిగిన రాతిపై ఏర్పాటై ఉన్నాయి. అందుకే ఏదైనా షెల్టర్, హోటళ్ళు, భవనాలు, తాత్కాలిక దుకాణాల నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
హిమాలయాల పెరుగుదల స్వభావానికి తోడు, అధికం అవుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు రుతుపవనాల నమూనాలను మార్చాయి. దీని వలన వాటి ఆగమనాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది. అటవీ నిర్మూలన, భూ వినియోగ విధానాలలో మార్పు నేల స్థిరత్వాన్ని క్షీణింపజేసి, వర్షపు నీటిని పీల్చుకునే ప్రకృతి సహజ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
‘చార్‌ధామ్’లోనూ..: హోటళ్ళు, హోమ్‌స్టేస్, ఇతర పౌర నిర్మాణాలు.. నదులు, వాగుల మార్గాన్ని ఆక్రమించకుండా చూసుకోవడానికి ఎటువంటి వ్యవస్థ లేదన్నది నిపుణుల మాట. 2023లో 56 లక్షలకు పైగా ప్రజలు చార్ ధామ్‌ను సందర్శించారని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
పెరుగుతున్న యాత్రికులు, పర్యాటకులకు వసతి కల్పించడానికి హోటళ్ళు, లాడ్జీలు, రోడ్లు, దుకాణాలను అస్థిరమైన వాలులు, వరదలకు గురయ్యే నదీ తీరాలలో నిర్మిస్తున్నారు. చార్ ధామ్ హైవే ప్రాజెక్ట్ కింద రోడ్ల విస్తరణ సున్నితమైన భూభాగాన్ని మరింత అస్థిరపరిచిందని, ఈ మార్గాల్లో తరచుగా కొండచరియలు విరిగిపడటానికి దారితీస్తోందని నిపుణులు భావిస్తున్నారు.
ఎన్నో ‘మేఘ విస్ఫోటనాలు’
» 2025 జూలై 26న రుద్రప్రయాగ్ జిల్లాలో పర్వత ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది. వరదల్లో చిక్కుకున్న 1,600 మంది చార్‌దామ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
» 2025 జూన్ 29న ఉత్తరాఖండ్‌లోని బార్‌కోట్–యమునోత్రి మార్గంలో నిర్మాణంలో ఉన్న భవనం దెబ్బతిని 9 మంది కార్మికులు గల్లంతయ్యారు.
» పర్వత ప్రాంతాల్లో ఏర్పడిన ఓ సరస్సు.. 2023 అక్టోబర్‌లో కుండపోత వర్షం కారణంగా సిక్కింలో వినాశకర వరదలకు దారితీసింది. ఫలితంగా కనీసం 179 మంది మరణించారు.
» 2021 అక్టోబర్‌లో అకాల భారీ వర్షం కారణంగా ఉత్తరాఖండ్‌లో రోడ్లు మునిగిపోయాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. కనీసం 46 మంది మరణించారు.
» 2021 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలతో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ధౌలిగంగా నది లోయలో నీరు, రాళ్ళు, శిథిలాలు ఉప్పొంగడంతో 200 మందికి పైగా మరణించారు.
» భారత్–పాకిస్తాన్ మధ్య ప్రవహించే జీలం నది 2014 సెప్టెంబర్‌లో అసాధారణంగా కురిసిన భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహించడంతో కాశ్మీర్.. గత 50 సంవత్సరాలలో అత్యంత దారుణమైన వరదలను చవిచూసింది. ఈ ఘటనలో దాదాపు 200 మంది భారతీయులు, 264 మంది పాకిస్తానీయులు మరణించారు.
‘నదులకు వాటి సొంతదైన, సహజ మార్గం ఉంది. కానీ మనం దాని మార్గంలో భవనాలను నిర్మించి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాం, మార్చేస్తున్నాం. మేఘ విస్ఫోటం అంచనా వేయలేం. ప్రభుత్వం ప్రమాదకర మండలాలను గుర్తించాలి’ అని శాస్త్రవేత్తలు అంటున్నారు.