
కిష్తవాడ్: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ వల్ల చేసిన విధ్వంసం అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా వచ్చిన వరదలతో పర్వతాల నుంచి భారీ బండరాళ్లు కొట్టుకొచ్చా యి. పెద్ద పెద్ద నికోఫర్ చెట్లు కూలిపోయాయి. ఇళ్లన్నీ మట్టి దిబ్బలతో కప్పుకుపోయాయయి. ఒక స్పెషల్ పోలీసు ఆఫీ సర్ సహా 60 మంది దుర్మరణం చెందారు. ఇప్పటికీ 80 మందికిపైగా జాడ దొరకడం లేదు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అక్కడ మేమున్నాం అంటోంది ‘అబాబిల్’ గ్రూప్. చీనాబ్ లోయలో ప్రమాదాలు జరిగినప్పుడు అత్య వసర సహాయం అందించడంలో ముందుంటుంది.
ఈ బృందంలో 250 మంది వలంటీర్లు ఉన్నారు. వీళ్లందరినీ కలిపేది వాట్సాప్. ఆపద ఎలాంటిదైనా సరే.. చిన్న సందేశం దూరంలోనే ఉంటారు. ఒక్క మెసేజ్ పెడితే చాలు.. ప్రమాద స్థలానికి చేరుకుంటారు. వీరికి కులం, మతంతో సంబంధం లేదు. ఆపదలో ఉన్నవారిని కాపాడటమే లక్ష్యం. హిందూ–ముస్లిం విభజన రాజకీయాలను, విద్వేష మాటలను పక్కన పెట్టి.. పనుల ద్వారా తామేంటో నిరూపిస్తున్నారు. కిష్తవాడ్ క్లౌడ్ బరస్ట్ వినగానే.. 45 మంది వలంటీర్లు, తొమ్మిది అంబులెన్స్‌లతో అక్కడికి చేరుకున్నారు. సైన్యంతోపాటు కలిసి పనిచేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. శిథిలాలను తొలగించడంలో సాయపడ్డారు.
ప్రమాదాలు సర్వసాధారణం..
‘చీనాబ్ లోయలో కొండచరియలు విరిగిపడటం, మంటలు, ప్రమాదాలు సర్వసాధారణం. అధికారులు, సైన్యం, ఇతర సహాయక సిబ్బంది చేరుకోవడానికి సమయం పట్టొచ్చు. మేం స్థానికులు. ఆ ప్రాంతం గురించి బాగా తెలిసిన మనుషులం. వారు వచ్చేదాక ఆగకుండా ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు మా బృందం ఏర్పడింది. ఏదైనా ప్రకృతి వైపరీత్యం లేదా ప్రమాదం జరిగినప్పుడు.. ప్రతిస్పందించడానికి మేం ఎల్లప్పుడూ ముందుంటాం’ అని చెబుతున్నారు. అబాబిల్ వలంటీర్ బుర్హాన్ మీర్. అబాబిల్ అరబిక్ పదం. ఇది పక్షుల సమూహాన్ని సూచిస్తుంది. మక్కాలోని కాబాను రక్షించిన పక్షులను వర్ణించడానికి ఇస్లామిక్ సంప్రదాయంలో దీనిని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు.