ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ! | CJP: World’s Biggest Party But Online Only | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ!

May 21 2026 9:48 AM | Updated on May 21 2026 10:13 AM

CJP: World’s Biggest Party But Online Only

మే 2026.. భారత్‌లో అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. పార్టీ పెట్టి వారం తిరగకముందే కాక్రోచ్ జనతా పార్టీ పెను సంచలనాలు సృష్టిస్తోంది. ఏకంగా బీజేపీ లాంటి దిగ్గజ పార్టీని మించిపోయి.. కురువృద్ధ పార్టీ కాంగ్రెస్‌ను సైతం పక్కకు నెట్టేసే దిశగా దూసుకుపోతోంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా.. అతిపెద్ద పార్టీగా ఎదగడానికి సిద్ధమైంది.

సీజేపీ.. కాక్రోచ్‌ జనతా పార్టీ. ఇది ప్రస్తుతానికి రాజకీయ పార్టీ కాదు. కేవలం వ్యంగ్య ఉద్యమం(సెటైర్‌) అని సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకు చెప్పనక్కర్లేదు. కానీ, డిజిటల్‌ ఫ్లాట్‌ఫారమ్‌లలో గత నాలుగైదు రోజులుగా మామూలు సత్తా చాటడడం లేదు. ముఖ్యంగా జెన్‌ జీ యువత ఆదరణ, మద్దతుతో దూసుకుపోతోంది. సో.మీ. ఫాలోవర్స్‌ విషయంలో బీజేపీని ఇప్పటికే దాటేసింది సీజేపీ. ఆ విషయాన్ని కూడా అంతే వెటకారంగా ప్రకటించుకుంది. ప్రస్తుతానికి అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న పార్టీగా కాంగ్రెస్‌ ఉంది. సీజేపీ దూకుడు చూస్తుంటే.. రేపో, మాపో ఆ ఫిగర్‌ను దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే ఆన్‌లైన్‌లో ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న పార్టీ(నాన్‌ పొలిటికల్‌)గా సీజేపీ నిలవనుంది.

అలా పుట్టింది..
మే 15, 2026న సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్ చేసిన కామెంట్లు హాట్‌ టాపిక్‌గా మారాయి. కొంతమంది యువకులు బొద్దింకల్లాంటివాళ్లు.. అని ఆయన చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగ యువతలో ఆగ్రహాన్ని రగిల్చాయి. పెద్ద సంఖ్యలో యువత దీన్ని అవమానకరంగా భావించి వ్యంగ్యరూపంలో ప్రతిస్పందించారు. అలాంటి వాళ్లలో అభిజీత్ దిప్కే ఒకడు. ఈ ఒక్కడే ఈ పెను సంచలనానికి కేంద్ర బిందువయ్యాడు.

మహారాష్ట్రలో పుట్టి, పుణేలో జర్నలిజం చదివిన అభిజిత్‌.. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్‌ రిలేషన్స్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. గతంలో ఆప్‌ వలంటీర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు డిజిటల్ క్యాంపెయిన్, మీమ్ కల్చర్‌లో ప్రత్యేక నైపుణ్యం ఇచ్చింది. ఆ నైపుణ్యంతో కాక్రోచ్‌ జనతా పార్టీ అంటూ సెటైరిక్‌ పేజీని ప్రారంభించాడు.

సీజేఐ వివరణ.. 
చీఫ్‌ జస్టిస్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం రేపాయి. దీంతో యువతపై తాను చేసిన వ్యాఖ్యలను పొరపాటుగా మీడియా చూపించిందని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ వివరణ ఇచ్చారు. ఫేక్‌ డిగ్రీలతో వృత్తుల్లోకి వచ్చినవాళ్లను మాత్రమే ఉద్దేశించి తాను అలా అన్నానని ఆయన చెప్పారు. భారత యువతపై తాను ఎలాంటి విమర్శ చేయలేదని.. పైగా వాళ్లను చూసి గర్వపడుతున్నానని.. వాళ్లే దేశాభివృద్ధికి మూలస్తంభాలని వ్యాఖ్యానించారు. అయితే.. అప్పటికే సీజేపీ జోరు మొదలైంది.

మేము సైతం.. 
మే 16న గూగుల్‌ ఫారమ్‌ ద్వారా అభిజిత్‌ సీజేపీ సభ్యత్వం ప్రారంభించాడు. వాయిస్‌ ఆఫ్‌ లేజీ అండ్‌ అన్‌ఎంప్లాయిడ్‌ అనే నినాదం ఇచ్చాడు. “సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ” అనే వ్యంగ్య సిద్ధాంతాలతో పార్టీ ముందుకు సాగుతోందని ప్రకటించాడు. అప్పటికే సీజేఐ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నా.. పెద్ద సంఖ్యలో యువత మాత్రం వెనక్కి తగ్గలేదు. కాక్రోచ్‌ పార్టీకి మద్దతు తెలిపేలా ‘‘మేము కూడా కాక్రోచులమే’ అంటూ ఫాలో బటన్‌ను క్లిక్‌ చేస్తూ, సభ్యత్వం తీసుకుంటూ తమ అసంతృప్తిని డిజిటల్ వేదికలపై భారీగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

అలా.. మే 17–20 మధ్య జస్ట్‌ నాలుగురోజుల్లోనే వెబ్‌ పేజీకి నాలుగు లక్షలకు పైగా సభ్యులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్ ఫాలోవర్లు వచ్చి చేరారు. తద్వారా ఆప్‌, బీజేపీ పార్టీలను చాలా దూరం నెట్టేశారు. సీజేపీ జోరు చూస్తుంటే కాంగ్రెస్‌ను కూడా దాటేందుకు ఎంతో సమయం పట్టేలా కనిపించడం లేదు. అలాగని ఇది పూర్తి సెటైరిక్‌ మూమెంట్‌గా ఉండిపోలేదు. అర్థవంతమైన చర్చలు, సమకాలీన అంశాలపై మేధావులతో డిబేట్లు, అభిప్రాయ సేకరణ.. ఇలా ఈ ఉద్యమం ప్రత్యేకంగా నిలిచింది.

 

మా లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కోసం కాదు, ఉద్యోగ సమస్యలు, పరీక్షల మోసాలు, యువత నిరాశ వంటి అంశాలను వ్యంగ్యరూపంలో వెలుగులోకి తేవడమే. ఇది యువతను అవమానపరిచిన వ్యాఖ్యకు ప్రతిస్పందన. మేము కాక్రోచులం అనే గుర్తింపుని స్వీకరిస్తున్నాం. ఎందుకంటే దేశ వ్యవస్థ అంతగా కుళ్లిపోయింది కాబట్టి. ఆ కుళ్లులోనే కాక్రోచులు బయటకు రావాల్సి వస్తోంది. ఇది సెటైరిక్‌ ఉద్యమం కావొచ్చు. అలాగని ఇదేం జోక్‌ కాదు. దేశంలో ఉన్న కోట్లాది మంది నిరుద్యోగుల గొంతుకంగా మారింది అని చెబుతున్నాడు. అయితే నేపాల్‌, బంగ్లాదేశ్‌లా జెన్‌జీ ఉద్యమానికి ఇది దారి తీస్తుందా? అనే ప్రశ్నకు ఆయన నుంచి నో అనే సమాధానమే వచ్చింది. 

👉సీజేఐ ఏమన్నారంటే.. కొంత మంది బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగాల్లేని యువత.. సోషల్‌ మీడియా, ఆర్‌టీఐ కార్యకర్తలుగా మారి, వ్యవస్థపై దాడి చేస్తున్నారు. 

👉సీజేఐ వ్యాఖ్యల్ని సమర్థించిన వర్గాలు: బొద్దింకలతో పోల్చడం అంటే.. యువతలోని సహనశక్తి, ఎక్కడైనా బతికే సామర్థ్యం ఉంది.

👉విమర్శించిన వర్గాలు: మేం కాక్రోచ్‌లమే అంటూ వెటకారంగా స్పందించినా.. నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది ఆ పేజీ ఫాలోయింగ్‌. పైగా ఆ ప్లాట్‌ఫారమ్‌లలో జరుగుతున్న డిబేట్‌లలో కామెంట్ల రూపంలో అభిప్రాయాలు తెలియజేస్తున్నారు

👉రాజకీయ విశ్లేషకులు: ఇది ఒక “సోషల్ మీడియా విప్లవం”. నిరుద్యోగ యువత అసంతృప్తిని వ్యంగ్యరూపంలో వ్యక్తం చేస్తున్నారు.

👉ప్రతిపక్ష నేతలు: భారతీయ యువతలోని నిరాశను ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది

👉ప్రభుత్వ అనుకూల వర్గాలు: ఇది కేవలం వ్యంగ్య ఉద్యమం మాత్రమే, నిజమైన రాజకీయ శక్తిగా మారడం కష్టం

అభిజిత్‌ ఎన్ని వివరణలు ఇస్తున్నప్పటికీ.. వ్యంగ్య ఉద్యమం నుంచి డిజిల్‌ విప్లవంగా మారిన కాక్రోచ్‌ జనతా పార్టీ జెన్‌జీ మద్దతుతో ఏదైనా పెను ఉద్యమానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి. 

Advertisement
 
Advertisement
Advertisement