రోడ్డు కుదరదా?.. బాబ్బాబు హెలికాప్టర్లైనా పంపండి | Chhattisgarh villagers unusual ​Helicopters plea to Amit Shah | Sakshi
Sakshi News home page

రోడ్డు కుదరదా?.. బాబ్బాబు హెలికాప్టర్లైనా పంపండి

May 26 2026 10:11 AM | Updated on May 26 2026 10:43 AM

Chhattisgarh villagers unusual ​Helicopters plea to Amit Shah

అది అడవుల మధ్య దాగి ఉన్న ఓ మారుమూల గిరిజన గ్రామం. నక్సలిజం ప్రభావం కారణంగా చాలాకాలం అభివృద్ధి పనులకు నోచుకోలేకపోయింది. పదేళ్ల కిందట ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. “నక్సల్ సమస్య తుడిచేశాం” అని ఇప్పుడు ప్రభుత్వాలు ప్రకటించుకున్నాక  ఆ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడవ లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై ఓ పని చేశారు. దశాబ్దాల నుంచి గుంతల దారే దిక్కుగా మిగిలిన ఆ గ్రామం.. ఇప్పుడు అసాధారణ విజ్ఞప్తితో వార్తల్లోకి ఎక్కింది.. 

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా మారుకి గ్రామం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓ లేఖ వెళ్లింది. “ అయ్యా.. రోడ్లు నిర్మించలేకపోతే కనీసం హెలికాప్టర్లు అయినా పంపండి” అంటూ కాస్త వెటకారంగానే అక్కడి వాస్తవ దుర్భర పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. ఆ లేఖ ఎలాగోలా సోషల్‌ మీడియాకు చేరింది. అక్కడి నుంచి మీడియాకు చేరింది. 

దట్టమైన అటవీ ప్రాంతం నడుమ బస్తర్ ప్రాంతానికి సమీపంగా ఉండే మారుకి గ్రామం.. కొండలు, వాగులు, గాఢమైన అడవులతో కూడిన కఠినమైన భౌగోళిక పరిస్థితులను కలిగి ఉంటుంది. ఇక్కడి గ్రామాలు పెద్దగా ఉండవు. కొన్ని వందల మంది మాత్రమే నివసించే చిన్న గిరిజన గూడేలు మాత్రమే కనిపిస్తాయి. గోండ్, మరియా వంటి ఆదివాసీ సముదాయాలకు చెందిన ప్రజలు ప్రధానంగా అటవీ ఉత్పత్తులు, చిన్న స్థాయి వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆధునిక సదుపాయాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతాల్లో రహదారి అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, జీవనాధారం కూడా. అయితే మారుకి గ్రామానికి వెళ్లే రహదారి పరిస్థితి గత ఏళ్లు గడుస్తున్న మారలేదు. 

దశాబ్దం కిందట.. బ్రిడ్జిలు, కల్వర్టులు వంటి నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, అవి మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. తవ్వకాలు చేసిన గుంతలు అలాగే వదిలేయడం వల్ల మార్గం పూర్తిగా ధ్వంసమై, రాళ్లు, మట్టి, గుంతలతో నిండిపోయిన ప్రమాదకర దారిగా మారింది. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారి గ్రామం బయట ప్రపంచానికి పూర్తిగా తెగిపోతుంది. చిన్న వర్షానికే రహదారి జారిపోవడం లేదంటే వాగులు పొంగిపోవడం వల్ల ప్రయాణం అసాధ్యమవుతుంది.

ఈ దారుణ పరిస్థితుల్లో గర్భిణీలు, వృద్ధులు,  తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారిని కూడా కొయ్య మంచాలపై కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సిన పరిస్థితి గ్రామంలో నిత్యకృత్యంగా మారింది. అంబులెన్స్‌లు గ్రామం లోపలికి రాలేకపోవడంతో ముందుగా అడవిలో కాలినడక, తర్వాత ప్రధాన రహదారికి చేరుకుని అక్కడి నుంచి మాత్రమే ఆసుపత్రికి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ ఆలస్యాల కారణంగా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ సర్పంచ్‌తో పాటు స్థానికులు చెబుతున్నదేమిటంటే.. ఈ సమస్యపై అనేకసార్లు జిల్లా అధికారులు మొదలుకొని ఉన్నతస్థాయి అధికారుల వరకు వినతులు ఇచ్చినా ఫలితం మాత్రం కనిపించలేదని. ప్రతి సారి హామీలు మాత్రమే వస్తున్నాయని, కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని వారు వాపోతున్నారు. 

మరోవైపు అధికారులు మాత్రం ఈ పరిస్థితికి భిన్నమైన వివరణలు ఇస్తున్నారు. భౌగోళికంగా అత్యంత కఠినమైన అటవీ ప్రాంతం కావడం, గతంలో నక్సలిజం ప్రభావం ఉండటం, కాంట్రాక్టర్లు మధ్యలో పనులు వదిలేయడం వంటి కారణాలతో రహదారి నిర్మాణం ఆలస్యమైందని వారు చెబుతున్నారు. అయితే ఇటీవల సుక్మా ప్రాంతంలో నక్సల్ ప్రభావం గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. రహదారి పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మాత్రం అందడం లేదని గ్రామస్తులు అంటున్నారు. 

అధికారులు త్వరలోనే పనులు వేగవంతం చేస్తామని, మిగిలిన రహదారి భాగాన్ని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని ఐదారు నెలలుగా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు చేసిన చివరి ప్రయత్నం..  “రోడ్లు ఇవ్వలేకపోతే హెలికాప్టర్లు అయినా ఇవ్వండి” ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement