ప్రతి వెయ్యి ఈవీలకు 5 చార్జింగ్ స్టేషన్లే
అమెరికా, చైనా, నార్వేలతో పోలిస్తే తక్కువే
దేశంలోని 30వేల స్టేషన్లలో పనిచేస్తున్నవి సగమే
2030 నాటికి దేశంలో 1.32 లక్షల స్టేషన్లు అవసరం
2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) దేశంలో 91,726 విద్యుత్ వాహనాలు (ఈవీ) అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో అమ్ముడైనవి 44,172 మాత్రమే. కానీ ఇందుకు తగ్గట్టుగా చార్జింగ్ స్టేషన్లు పెరగడం లేదు. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలోని పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 30లు. ఇందులో పనిచేస్తున్నవి 14,450. దేశంలో ఈవీలు పెరుగుతున్నంత వేగంగా చార్జింగ్ స్టేషన్లు పెరగడం లేదు.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫడా) గణాంకాల ప్రకారం.. 2024–25లో మొత్తంగా అమ్ముడైన ఈవీలు 1.1 లక్షలు. అదే, ఈ ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లోనే అమ్మకాలు 90 వేల మార్కును దాటేశాయి. 2014–15లో మొత్తం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో ఈవీల వాటా కేవలం 0.01 శాతం. అదే 2024–25లో 7.31 శాతం. కానీ ఇందుకు తగ్గట్టుగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు పెరగడం లేదు. 2021–22లో దేశంలో ఉన్న స్టేషన్లు 1,800. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఇవి 30 వేలకు పెరిగాయి. ఇందులో 15,550 పనిచేయడం లేదు.
ప్రతి 50 కి.మీ.కి ఒకటి
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలోని 91 శాతం జాతీయ రహదారుల్లో ప్రతి 50 కిలోమీటర్లకు కనీసం ఒక ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ ఉంది. ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోలిస్తే మనదేశంలో చార్జింగ్ స్టేషన్లు, అందులోనూ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య తక్కువే. చైనాలో ప్రతి 100 కిలోమీటర్లకు 100 స్టేషన్లు ఉన్నాయి. అమెరికాలో ఈ సంఖ్య 70. అత్యధికంగా నార్వేలో 100 కి.మీ.కి 180 ఉన్నాయి. చైనాలోని ప్రతి 1,000 స్టేషన్లలో 45 శాతం ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు. ఈ సంఖ్య నార్వేలో అత్యధికంగా 70 శాతం.
స్టేషన్లు – సమస్యలు
నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఈవీ చార్జర్లు చార్జింగ్‌కు పనికిరావడం లేదు. ఆయా కంపెనీల కార్లకు సంబంధించిన యాప్స్, చెల్లింపు వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం ఈవీల చార్జింగ్ ఇంటి దగ్గర లేదా పనిచేసే ప్రదేశాల్లోనే జరుగుతోంది. మెట్రో నగరాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉండే చార్జింగ్ స్టేషన్ల వినియోగం తక్కువగా ఉంటోందని, అందువల్ల తాము పెట్టిన పెట్టుబడులు కూడా గిట్టుబాటు కావడం లేదని కంపెనీలు అంటున్నాయి.
72,300 స్టేషన్ల లక్ష్యం
కేంద్ర ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహించడానికి ఫేమ్ 2 కింద ఇప్పటికే 7,400 స్టేషన్ల ఏర్పాటులో తోడ్పాటు అందించింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా 72,300 స్టేషన్లు ఏర్పాటుచేయాలన్నది కేంద్రం లక్ష్యం. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం.. 2030 నాటికి దేశంలో 1.32 లక్షల స్టేషన్లు అవసరమవుతాయి. సగటున ప్రతి 1,000 ఈవీలకు 45–50 ఉండాలి.
మెట్రోల్లోనే 62 శాతం దేశంలోని చార్జింగ్ స్టేషన్లలో సుమారు 62 శాతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనే ఉన్నాయి. కానీ, ఈవీల అమ్మకాలు పెరుగుతున్న మెట్రోయేతర నగరాల్లో మాత్రం 38 శాతమే ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాల్లో సగానికిపైగా టాప్ – 20 నగరాల్లో కాకుండా.. బిహార్, ఆంధ్రప్రదేశ్, యూపీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని చిన్న నగరాల్లోనే జరగడం గమనార్హం.


