చీతాలు.. చింతలు.. కాపాడుకోవడం ఎలా? మూడు నెలల్లో మూడు..

Challenges faced in the Cheetah Project - Sakshi

మూడు నెలల్లో మూడు చీతాల మృతితో ఆందోళనలు

చీతాల ప్రాజెక్టులో ఎదురవుతున్న సవాళ్లు

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లోనే అంతరించిపోయిన జాబితాలో  చేరిపోయిన చీతాల సంతతిని తిరిగి భారత్‌లో పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీతాల ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మొత్తం 20 చీతాలను  తీసుకువచ్చాము. గత మూడు నెలల్లోనే మూడు చీతాలు మరణించడంపై జంతు ప్రేమికుల్లో ఆందోళన నెలకొంది. మూడు చీతాలను మనం కోల్పోయినప్పటికీ మార్చి నెలలో సియాయా అనే చీతా నాలుగు పిల్లలకి జన్మనివ్వడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకెళుతుందన్న ఆశలు ఇంకా అందరిలోనూ ఉన్నాయి. చీతాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందనే చర్చ మొదలైంది.

చీతాలను కాపాడుకోవడం ఎలా?
ఆఫ్రికా నుంచి తెచ్చిన చీతాల సంతతి పెరగడానికి చాలా ఏళ్లు ఎదురు చూడక తప్పని పరిస్థితులు ఉన్నాయి. చీతాలకు రేడియో కాలర్‌ ఏర్పాటు చేసి శాటిలైట్‌ ద్వారా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ప్రతీ క్షణం వాటి భద్రతని పర్యవేక్షించడం సంక్లిష్టంగా మారింది. అందుకే వాటిని ఎన్‌క్లోజర్లకే పరిమితం చేయడంపై వన్యప్రాణుల నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పరిమితమైన స్థలంలో వాటిని బంధించి ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని వరల్డ్‌లైఫ్‌ బయోలజిస్ట్‌ రవి చెల్లం అభిప్రాయపడ్డారు. మగ, ఆడ చీతాలను ఎన్‌క్లోజర్ల నుంచి బయటకి తరచూ వదులుతూ ఉండాలని అప్పుడే వాటి సంతతి అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక వాతావరణపరమైన అడ్డంకుల్ని అధిగమించాలంటే మరిన్ని ఏళ్లు గడవడం తప్ప మరో మార్గం లేదన్నది వన్యప్రాణ నిపుణుల అభిప్రాయంగా ఉంది. రుతుపవనాల సీజన్‌ ముగిసిన తర్వాత చీతాలను వేరే అడవులకి కూడా తరలించే ఆలోచనలో కేంద్రం ఉంది.

ఎదురవుతున్న సవాళ్లు
► చీతాల మనుగడుకు ఎదురవుతున్న అతి పెద్ద సవాల్‌ వాతావరణం. మధ్యప్రదేశ్‌లో కునో జాతీయ ఉద్యానవనంలో వాతావరణం ఆఫ్రికా వాతావరణం కంటే చాలా విభిన్నమైనది. కునోలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకు రాల్చే అడవులుంటాయి. ఆఫ్రికాలో గడ్డి మైదానాలు, దట్టమైన వృక్షాలు  ఎక్కువ. ఇన్నాళ్లూ అక్కడ వాతావరణానికి అలవాటు పడిన చీతాలకు ఒకేసారి మార్పు రావడం తట్టుకోలేకుండా ఉన్నాయి.

మన దేశంలో ఉద్యానవనాలు చీతాలకు నివాసయోగ్యాలుగా మారగలవో లేదోనన్న సందేహాలు కూడా నిపుణుల్లో ఉన్నాయి. ప్రభుత్వం చీతాల ప్రాజెక్టు ప్రారంభించడానికే ముందే జంతు పరిరక్షణ నిపుణులు భారత పర్యావరణ వ్యవస్థకి చీతాలు అలవాటు పడడానికి చాలా ఏళ్లు పడుతుందని హెచ్చరించారు.

► ఇక రెండో పెద్ద సవాల్‌ స్థలం. కునో జాతీయ పార్క్‌లో  చీతాలు ఉంచిన వాటికి ఎన్‌క్లోజర్‌ సరిపోదు. అవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత దట్టమైన అటవీ ప్రాంతం అవసరముంది. వచ్చే అయిదేళ్లలో మరో 30 చీతాలను తెచ్చే ప్రణాళికలు ఉండడంతో వాటిని ఎక్కడ ఉంచుతారో కూడా ముందుగానే చూడాల్సిన అవసరం ఉంది.

► కునోలో జంతువుల మధ్య ఘర్షణ జరుగుతూ ఉండడం అధికమే. చీతా కంటే దూకుడుగా వ్యవహరించే పులులు, చిరుతుపులులు పోటాపోటీగా కొట్టుకుంటాయి. ఒక్కోసారి చీతాలను ఉద్యానవనం గేటు వరకు తీసుకొస్తూ ఉంటాయి. అక్కడ మనుషులే వాటికి శత్రువులుగా మారుతుంటారు. ఇక మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణలతో ఎంతో విలువైన జంతు సంపదని కోల్పోతున్నాం. దీంతో జీవవైవిధ్యానికి ముప్పు కలుగుతోంది.

► చీతాల సంరక్షణకి నియమించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికాకి పంపించి శిక్షణ ఇచ్చింది. కానీ ఆ శిక్షణ సరిపోలేదు. రెండు చీతాలు అనారోగ్య కారణాలతో మరణించాయంటేనే సంరక్షకులకు వాటిపై పూర్తి స్థాయి అవగాహన లేదన్న విషయం తెలుస్తోంది.

► భారత్‌లో చీతాలు ప్రధానంగా కృష్ణజింకలు, చింకారాలను వేటాడి తింటాయి. ప్రస్తుతం కునో జాతీయ ఉద్యానవనంలో ఈ జంతువులు అంతగా లేవు. దీంతో చీతాల కడుపు నిండడం కూడా సమస్యగానే మారింది.

మార్చి 27: నమీబియా నుంచి తీసుకువచ్చిన శష అనే చీతా కిడ్నీపరమైన వ్యాధితో మరణించింది.

ఏప్రిల్‌ 13: దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన ఉదయ్‌ అనే చీతా అనారోగ్య కారణాలతో మృతి చెందింది

మే 9: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన చీతాల్లో దక్ష అనే ఆడ చీతాను మేటింగ్‌ సమయంలో మగ చీతాలు క్రూరంగా వ్యవహరించి మీద పడి చంపేశాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top