
న్యూఢిల్లీ: వార్షిక ఇంక్రిమెంట్ పెరగడానికి ఒక్క రోజు ముందు రిటైరైన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇకపై ఆ లబ్ది చేకూరనుంది. వారికి నోషనల్ ఇంక్రిమెంట్ లబ్ధి ప్రయోజనాలు వర్తింపజేస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఉదాహరణకు రూ.79,000 వేతనం పొందే కేంద్ర ప్రభుత్వోద్యోగి జూన్ 30న రిటైరవడంతో జూలై 1న రావాల్సిన రూ.2,000 వార్షిక ఇంక్రిమెంట్ కోల్పోయాడు.
పెన్షన్ గణింపులో మాత్రం ఆయన చివరి వేతనాన్ని రూ. 81,000గా పరిగణిస్తారు. దాంతో రిటైర్మెంట్ తాలూకు ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ఇకపై జూన్ 30, డిసెంబర్ 31న రిటైరయ్యే వారికి తదుపరి నోషనల్ ఇంక్రిమెంట్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం వివరించింది. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఆలిండియా ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ దీన్ని స్వాగతించింది. నిబంధనల ప్రకారం కేంద్ర ఉద్యోగులకు జూలై 1, లేదా జనవరి 1న ఇంక్రిమెంట్ ప్రకటిస్తారు.