
పైలట్ ప్రాజెక్టు విజయవంతం
దేశవ్యాప్తంగా అమలుకు నిర్ణయం
74 వేల బోగీలు, 15 వేల లోకోమోటివ్‌లలో కెమెరాలు
ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ద్వారాల వద్ద ఏర్పాటు
100 కిలోమీటర్ల వేగంలోనూ స్పష్టమైన చిత్రాలు వచ్చేలా నాణ్యత
అత్యాధునిక ఫీచర్ల కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి ఆదేశం
ఒక్కో ప్రయాణికుల బోగీలో 4, లోకోమోటివ్‌లో 6 కెమెరాలు
సీసీ కెమెరాలతో దోపిడీలు, దాడులు తగ్గుతాయని అంచనా
న్యూఢిల్లీ: రైళ్లలో త్వరలో సీసీటీవీ కెమెరాలు దర్శనమివ్వనున్నాయి. భారతీయ రైల్వేస్ పరిధిలో ఉన్న మొత్తం 74 వేల ప్యాసింజర్ బోగీలు, 15 వేల సరుకు రవాణా లోకోస్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నట్లు రైల్వేశాఖ ఆదివారం ప్రకటించింది. ఉత్తర రైల్వే విభాగంలో కొన్ని ప్రయాణికుల బోగీలు, లోకోల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల వల్ల సత్ఫలితాలు వచ్చాయని, త్వరలో అన్ని బోగీల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
బోగీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు శనివారం రైల్వే శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పైలట్ ప్రాజెక్టులో వచ్చిన ఫలితాలను సమీక్షించి, అన్ని బోగీల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో రైల్వేశాఖ తెలిపింది.
ప్రయాణికులకు భద్రత
బోగీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ప్రయాణికుల భద్రత మరింత పెరుగుతుందని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. ‘సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ప్రయాణికుల భద్రత మరింత పెరుగుతుంది. బోగీల్లో దోపిడీలకు పాల్పడే దొంగలు, వ్యవస్థీకృత ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రయాణికుల ప్రైవసీకి ఇబ్బంది కలగ కుండా సీసీ కెమెరాలను బోగీల ద్వారాల వద్దనే ఏర్పాటు చేస్తాం’అని తెలిపారు.
ఒక్కో బోగీలో 4 కెమెరాలు
ప్రయాణికుల రైళ్లలో ఒక్కో బోగీలో నాలుగు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. బోగీకి ఉండే రెండు ద్వారాల్లో ఒక్కో ద్వారం వద్ద రెండు చొప్పున డోమ్ టైప్ అత్యాధునిక కెమెరాలు అమర్చుతారు. లోకోమోటివ్‌లలో 6 సీసీ కెమెరాలు ఉంటాయి. ముందు, వెనుక భాగాల్లో ఒక్కోటి, కార్‌కు రెండు వైపులు రెండు డోమ్ టైప్ కెమెరాలు ఉంటాయి. వీటికి అదనంగా రెండు డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్ కెమెరాలు కూడా ఏర్పాటుచేస్తారు. ఈ సీసీ కెమెరాలన్నీ ఎస్‌టీక్యూసీ సర్టిఫికేషన్‌తో అత్యాధునిక ఫీచర్లతో ఉంటాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
కెమెరాల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని రైల్వే మంత్రి సూచించినట్లు చెప్పారు. రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా, వెలుతురు సరిగా లేకపోయినా సీసీ కెమెరా ఫుటేజీ అత్యంత స్పష్టంగా ఉండేలా నాణ్యమైన కెమెరాల అమర్చాలని కోరినట్లు వెల్లడించారు. ఇండియా ఏఐ మిషన్ సహకారంతో సీసీ కెమెరాల డేటా సేకరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించుకోవాలని అశ్వినీ వైష్ణవ్ సూచించినట్లు పేర్కొన్నారు.