సీబీఎస్ఈ టెన్త్‌ టాప‌ర్లు వీరే! | CBSE 10th Class Toppers 2026 Check State wise Toppers Name | Sakshi
Sakshi News home page

సీబీఎస్ఈ టెన్త్‌ టాప‌ర్లు వీరే!

Apr 16 2026 3:15 PM | Updated on Apr 16 2026 4:07 PM

CBSE 10th Class Toppers 2026 Check State wise Toppers Name

ఢిల్లీ: సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్ఈ) 10వ తరగతి బోర్డు ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల‌య్యాయి. ప‌రీక్ష రాసిన వారిలో 93.66% మంది ఉత్తీర్ణుల‌య్యారు. ఈసారి కూడా బాలిక‌లే పైచేయి సాధించారు. బాలికలు 94.99 శాతం ఉత్తీర్ణత నమోదు చేయ‌గా, బాలురు 92.69 శాతం మంది ఉత్తీర్ణుల‌య్యారు. మొత్తంగా చూస్తే ఉత్తీర్ణ‌త శాతం గ‌తేడాది (93.66)  కంటే ఈసారి 0.04 శాతం పెరిగింది.

ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా 24.72 ల‌క్ష‌ల మంది ప‌రీక్షలు రాయ‌గా వారిలో 23.16 ల‌క్ష‌ల మంది పాస‌య్యారు. ఈ ఏడాది 10వ తరగతి బోర్డు పరీక్షల్లో మొత్తం 2,21,574 మంది విద్యార్థులు (8.96 శాతం) 90 శాతానికి పైగా మార్కులు సాధించగా..  55,364 మంది విద్యార్థులు (2.24 శాతం) 95 శాతానికి పైగా మార్కులు సాధించారు. టాప‌ర్స్ వివ‌రాల‌ను సీబీఎస్ఈ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. పులువురు విద్యార్థులు వందకు వంద శాతం స్కోరు సాధించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్ద‌రు విద్యార్థుల‌కు 100 శాతం మార్కులు వ‌చ్చిన‌ట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది. బిధాన్‌నగర్‌లోని భవన్స్ గంగాబక్స్ కనోరియా విద్యామందిర్ విద్యార్థిని అనిషా ఘోష్, రాజ్‌పూర్ సోనార్‌పూర్‌లోని బీడీఎం ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి జయశిర్ష్య బసు 500కి 500 మార్కులు సాధించారు. 

కాగా, మెడిసిన్ చ‌ద‌వాల‌న్న‌ది త‌న ల‌క్ష్య‌మ‌ని జయశిర్ష్య బసు తెలిపాడు. 12వ త‌ర‌గ‌తిలో పీసీఎంబీ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బ‌యాల‌జీ) కోర్సులో చేరాల‌నుకుంటున్న‌ట్టు చెప్పాడు. వంద శాతం మార్కులు సాధించ‌డం ప‌ట్ల అనిషా ఘోష్ ఆనందం వ్య‌క్తం చేసింది. అయితే క‌వ‌ల సోద‌రి అనిష్క‌కు 496 మార్కులు రావ‌డం కొంచెం నిరాశ‌కు గురిచేసింద‌ని తెలిపింది. తామిద్ద‌రం క‌ష్ట‌ప‌డి చ‌దివామ‌ని, స్కూల్ కూడా బాగా స‌హ‌క‌రించింద‌ని చెప్పింది.

చ‌ద‌వండి: 'నాన్న‌'గా గ‌ర్వించే క్ష‌ణం!   

పూరీకి చెందిన టీనా రాత్, ఘజియాబాద్‌కు చెందిన దక్ష్, గురుగ్రామ్‌కు చెందిన తానయ్ శ్రీవాస్తవ, సోనిపట్‌కు చెందిన మనన్ కూడా వంద శాతం స్కోరు చేసిన‌ట్టు మీడియా వెల్ల‌డించింది. కోచింగ్ కంటే సొంత ప్రిప‌రేష‌న్ ద్వారానే మంచి మార్కులు సాధించామ‌ని ప‌లువురు టాప‌ర్లు తెలిపారు. రోజుకు దాదాపు 13 గంట‌లు చదివాన‌ని దక్ష్ వెల్ల‌డించాడు. తాను 10 నుంచి 12 గంట‌ల పాటు ప్రిప‌రేష‌న్ సాగించాన‌ని టీనా రాత్ తెలిపింది. కార్డియాక్ సర్జన్ కావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని చెప్పింది. 

అప్పుడు, ఇప్పుడు సేమ్‌
సీబీఎస్ఈ టెన్త్ 2026 ఫ‌లితాల్లో విజ‌య‌వాడ‌, తిరువ‌నంత‌పురం రీజియ‌న్లు 99.79 శాతం ఉత్తీర్ణ‌త‌తో టాప్‌లో నిలిచాయి. గ‌తేడాది ఫ‌లితాల్లో కూడా ఈ రెండు రీజియ‌న్లే మొద‌టి స్థానంలో ఉండ‌డం విశేషం. కాగా, విజ‌య‌వాడ రీజియ‌న్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement