కౌంటింగ్‌ ప్రక్రియ.. ఈసీ కఠిన నిబంధనలు

Candidates Must Show 2 Vaccine Shots To Enter Counting Centre - Sakshi

కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు తప్పనసరి

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద జనసమూహానికి అనుమతి లేదు

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ విజృంభిస్తోంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా విజృంభణకు తాజాగా దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలే కారణమని జనాలు బలంగా విశ్వస్తున్నారు. ఈ క్రమంలో మద్రాస్‌ హైకోర్టు ఎన్నికల కమిషన్‌ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోవిడ్‌ వ్యాప్తికి ఈసీనే కారణమని.. హత్యా కేసు పెట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మే 2న జరగబోయే కౌంటింగ్‌కు సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారు, కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపింది. 

ఈ మేరకు ఈసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈసీ ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద జనసమూహానికి అనుమతి లేదని తెలిపింది. కౌంటింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లాలనుకునే వారు ఆర్‌టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టు, టీకా రెండు డోసులు తీసుకున్నట్లు వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ను కౌంటింగ్‌కు 48 గంటల ముందే సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించింది. అభ్యర్థులు కౌంటింగ్‌ రోజున హాజరయ్యే ఏజెంట్లకు సంబంధించిన లిస్ట్‌ను మూడు రోజుల ముందుగానే అందించాలని తెలిపింది. 

ఈ ఏడాది దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గురువారం బెంగాల్‌లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు పెద్ద ఎత్తున జనాలతో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే కోవిడ్‌ విజృంభిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 

చదవండి: ఎన్నిక‌ల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top