ఎన్నిక‌ల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Madras High Court: Election Commission Responsible For Covid19 Surge - Sakshi

చెన్నై: భారత ఎన్నిక‌ల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. క‌రోనా మ‌హ‌మ్మారి రెండో ద‌శ భార‌త్‌లో ప్ర‌మాద‌క‌ర స్థితిలో ఉంద‌ని వ్యాఖ్యానించింది. నిత్యం మూడు ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని ఆందోళ‌న వ్యక్యం చేసింది. అయిదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు, కుంభ మేళా, ప్ర‌జ‌ల నిర్ల‌క్ష్యం కార‌ణంగా కేసులు తీవ్ర స్థాయిలో న‌మోద‌వుతున్నాయ‌ని తెలిపింది. క‌రోనా విప‌త్తు ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్ర‌శ్నించింది. ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహంలో ఉన్నారా’? అని ఈసీఐ కౌన్సిల్‌ను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. 

ఇక త‌మిళ‌నాడులో క‌రోనా సెకండ్ వేవ్‌కు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌యే ఏకైక కార‌ణ‌మ‌ని మద్రాస్ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈసీ అధికారుల‌పై మ‌ర్డ‌ర్ కేసులు పెట్టాల‌ని పేర్కొంది. క‌రోనా క‌ట్ట‌డికి స‌రైన ప్ర‌ణాళిక లేకుంటే మే 2న విడుద‌ల‌య్యే ఫ‌లితాల‌ను నిలిపివేస్తామ‌ని హెచ్చ‌రించింది. ఏప్రిల్ 30న కోర్టు మరోసారి కౌంటింగ్ డేకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష జరుపుతుందని తెలిపింది. 

కాగా తమిళనాడులో గ‌డిచిన 24 గంటల్లో 15,659 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,81,988కి చేరింది. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో 4206 ఒక్క చెన్నై నగరంలోనే వెలుగు చూశాయి. కరోనా మరణాలు కూడా తమిళనాడులో కలకలం రేపుతున్నాయి.  ఆదివారం రోజు క‌రోనా సోకి 82 మంది మ‌ర‌ణించారు. 

చదవండి: మా ఆక్సిజన్‌ను ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయొద్దు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top