‘సార్థక్‌–పీడీఎస్‌’కు పచ్చజెండా! | Cabinet approves technology-driven PDS scheme to strengthen food security | Sakshi
Sakshi News home page

‘సార్థక్‌–పీడీఎస్‌’కు పచ్చజెండా!

May 28 2026 12:34 AM | Updated on May 28 2026 12:34 AM

Cabinet approves technology-driven PDS scheme to strengthen food security

రూ.25 వేల కోట్లతో రేషన్‌ వ్యవస్థ ఆధునీకరణ

ఐదేళ్లలో అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

సాంకేతికతతో మరింత పారదర్శకంగా పథకం

పెరగనున్న డీలర్ల కమీషన్‌ ∙81.35 కోట్ల మందికి ప్రయోజనం

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పేద ప్రజల ఆహార భద్రతను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) సమావేశం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)ను మరింత బలోపేతం చేసేందుకు ఆమోదం తెలిపింది. 

ఆధునిక సాంకేతిక ఆధారిత సంస్కరణల ద్వారా దేశ ప్రజా పంపిణీ మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. సీసీఈఏ నిర్ణయా లను ఐటీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరాలు వెల్లడించారు. కేబినెట్‌ నిర్ణయం ప్రకారం..పాత పథకాలను విలీనం చేస్తూ ‘సార్థక్‌–పీడీఎస్‌’ (ఎస్‌ఏఆర్‌టీహెచ్‌ఏకే– పీడీఎస్‌) అనే పథకం అమల్లోకి రానుందని తెలిపారు. 16వ ఆర్థిక సంఘం కాల పరిమితి ముగిసే 2031 మార్చి 31వ తేదీ వరకు ఈ పథకం అమలులో ఉంటుందన్నారు. దీని కోసం కేంద్రం తన వాటా కింద రూ.25,530 కోట్లను కేటాయించిందని మంత్రి చెప్పారు. 

రెండు పథకాలు కలిపి..
ప్రస్తుతం అమలవుతున్న ’ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద అంతర్రాష్ట్ర ఆహార ధాన్యాల రవాణా, ఎఫ్‌పీఎస్‌ (రేషన్‌) డీలర్ల మార్జిన్‌ కోసం రాష్ట్ర సంస్థలకు సహాయం’ పథకాన్ని ’ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతికత ద్వారా ఆధునీకరణ, సంస్కరణల పథకం (స్మార్ట్‌ పీడీఎస్‌)’ లను విలీనం చేస్తూ ’సార్థక్‌–పిడిఎస్‌’ను ఒక సమగ్ర పథకంగా రూపొందించారు. 

ఆర్థిక సాయం, సాంకేతిక ఆధునీకరణను ఒకే పరిపాలనా పరిధిలోకి తీసుకురావడం ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం–2013 అమలును మరింత బలోపేతం చేయడమే ఈ విలీనం ముఖ్య ఉద్దేశమని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. ఆహార ధాన్యాల పంపిణీ, సరుకుల రవాణా నిర్వహణ, రవాణా సౌకర్యాలు, సరుకుల లోడింగ్‌–అన్‌లోడింగ్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అంతటా నిర్మాణా త్మకమైన సంస్కరణలను తీసుకురావడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. రేషన్‌ డీలర్ల కమీషన్లను పెంచడంతో పాటు, నిరుపేదలకు రేషన్‌ సరుకులు సక్రమంగా అందేలా నిబంధనలను సవరించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. 

రేషన్‌కూ కృత్రిమ మేధ
రేషన్‌ పంపిణీలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోనున్నారు. ఆర్టిఫి షియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఐ), బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలను ఉపయోగించి రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ చేపట్టనున్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక ఏఐ వ్యవస్థను, డేటా పర్యవేక్షణ కోసం ‘స్టేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల’ను ఏర్పాటు చేస్తారు. దేశంలోని 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు నాణ్యమైన ఆహార ధాన్యాలను అందించే సామాజిక, చట్టబద్ధమైన బాధ్యతను ఈ పథకం మరింత సులభతరం చేయనుంది. గత దశాబ్ద కాలంలో సాధించిన ఈ–పోస్‌ గుర్తింపు, ఆన్‌లైన్‌ కేటాయింపులు, ‘మేరా రేషన్‌’వంటి డిజిటల్‌ సంస్కరణలను ‘సార్థక్‌– పీడీఎస్‌’మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లనుందని మంత్రి వైష్ణవ్‌ స్పష్టం చేశారు.

ఎండల తీవ్రతను తగ్గించేలా చర్యలు తీసుకోవాలి
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకుగాను వివిధ శాఖలు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కేబినెట్‌ భేటీలో ప్రధాని మోదీ కోరారని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. ఏకతాటిపైకి వచ్చి అందరూ కలిసికట్టుగా పనిచేసే విధానం అత్యంత అవసరమని ప్రధాని చెప్పారన్నారు. ముఖ్యంగా ఆరోగ్య, జలవనరుల వంటి శాఖలు స్పందించాలని కోరారన్నారు. దీనిపై ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ పరిధిలో కార్యాచరణ ప్రణాళికలను నిర్ణయించుకుంటాయని వైష్ణవ్‌ తెలిపారు. ఎండల తీవ్రతను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిందని ఆయన పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement