తొలుత భయపడ్డా.. కానీ నా భర్త ధైర్యం చెప్పాడు

UP Bride Fell From Roof Hours Before Wedding Groom Tie Knot - Sakshi

వధువుకు గాయాలు.. ఆస్పత్రిలోనే పెళ్లి

లక్నో: రెండు మనసులు కలిస్తే చాలు.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు సాగితే.. విధి కూడా తమను ఒక్కటి కాకుండా ఆపలేదని నిరూపించాడు ఓ పెళ్లికొడుకు. కాబోయే భార్య ప్రాణాపాయంలో పడి, ఆస్పత్రి బెడ్‌ మీద ఉంటే అక్కడే వివాహ తంతు పూర్తిచేసి జీవితాంతం తనకు అండగా ఉంటానని బాస చేశాడు. మనసును హత్తుకునే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రయాగ్‌రాజ్‌ జిల్లాకు చెందిన అద్వేష్‌, ఆర్తిలకు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇందుకోసం ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే ప్రమాదవశాత్తూ పెళ్లి జరిగే రోజునే వధువు ఆర్తి ఇంటికప్పు నుంచి జారి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఆమె కాళ్లు, వెన్నెముకకు గాయాలయ్యాయి. 

దీంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న పెళ్లికొడుకు అద్వేష్‌ బంధుగణంతో కలిసి హుటాహటిన అక్కడికి చేరుకున్నాడు. ముహూర్త సమయం దాటిపోకముందే ఆర్తి నుదుటిన సింధూరం దిద్ది తన భార్యగా చేసుకున్నాడు. ఇరు కుటుంబాలు వారికి ఆశీస్సులు అందజేశాయి. ఈ విషయం గురించి డాక్టర్‌ సచిన్‌ సింగ్‌ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘ఆర్తి వెన్నెముకకు గాయమైంది. కాళ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం తాను నడిచే పరిస్థితుల్లో లేదు. కానీ ఈరోజే తన పెళ్లి జరగాల్సి ఉంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పెళ్లి తంతు నిర్వహించేందుకు అనుమతినిచ్చాం. కాళ్లు మాత్రం కదపొద్దని తెలిపాం. ఆ జంటను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు.(చదవండి: అందుకే హనీమూన్‌ రద్దు చేసుకున్నారు!)

ఆరోగ్యం బాగుపడకపోయినా పర్లేదు అన్నాడు..
‘‘తొలుత నాకు కాస్త భయం వేసింది. అయితే నా భర్త నాకు ధైర్యం చెప్పాడు. నా ఆరోగ్యం కుదుటపడకపోయినా తోడుగా ఉంటానన్నాడు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది’’ అని వధువు ఆర్తి ఉద్వేగానికి లోనైంది. ఇక అద్వేష్‌ మాట్లాడుతూ.. ‘‘ ఏం జరిగినా వెనకడుగు వేయొద్దు అనుకున్నాను. తను కష్టాల్లో ఉన్నపుడే కదా నా అవసరం ఉండేది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’అని భార్యపై ప్రేమను చాటుకున్నాడు. (చదవండి: మా అమ్మకు పెళ్లి... నాక్కూడా..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top