
బీజేపీ పార్టీ ఎంపీలకు ఓటింగ్ విధానంపై నేడు వర్క్‌షాప్
తొమ్మిదో తేదీన జరగనున్న ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పక్షాలు తమ కసరత్తును వేగవంతం చేశాయి. తొమ్మిదో తేదీ జరగబోయే ఎన్నికల్లో తమతమ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటింగ్ విధానం, పోలింగ్ సరళిపై పార్టీ ఎంపీలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇందులో భాగంగా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం పార్టీ ఎంపీలకు పార్లమెంట్‌లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. ఓటింగ్‌లో పాల్గొనడం, ఓటు వేసే విధానంపై వారికి అవగాహన, శిక్షణ కల్పిస్తారు. సోమవారం ఎన్డీఏ కూటమి పక్షాలతో కలిపి మరో వర్క్‌షాప్ ఏర్పాటు చేసింది. ఎంపీలకు ఓటింగ్‌పై అవగాహన కార్యక్రమం కొనసాగుతుంది.
నిజానికి బీజేపీ ఎంపీలతో ఒకటి, ఎన్డీఏ పక్షాల ఎంపీలతో కలిపి మరో విందు భేటీలను ఏర్పాటు చేసినా, దేశవ్యాప్తంగా వరద పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విందు భేటీలను బీజేపీ రద్దు చేసింది. ఉప రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ పక్షాల తరఫున సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి పక్షాల తరఫున జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్న విషయం విదితమే. బ్యాలెట్ పత్రంలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరు ముందుగా ఉండగా, తర్వాత సీపీ రాధాకృష్ణన్ పేర్లు ఉన్నాయి.
ప్రాధాన్యతల క్రమంలో ఓటు వేయాల్సి ఉండగా, తొలి ప్రాధాన్యత గుర్తించడం తప్పనిసరి కాగా, రెండో ప్రాధాన్యత ఐఛ్చికం. ప్రాధాన్యతలను గుర్తించడానికి ప్రత్యేకమైన పెన్నులను ఎన్నికల కమిషన్ సరఫరా చేస్తుంది. బ్యాలెట్ పేపర్ అందజేసినప్పుడు నియమించబడిన అధికారి ఓటర్లకు ఈ పెన్నును అందజేస్తారు. ఓటర్లు బ్యాలెట్ పేపర్‌ను ఈ ప్రత్యేకమైన పెన్నుతో గుర్తించాలి. మరే ఇతర పెన్ను వాడరాదు. వీటన్నింటిపై ఎంపీలకు పార్టీ అవగాహన కల్పించనుంది.
8న ఇండియా కూటమి మాక్‌పోల్
ఇండియా కూటమి ఈ నెల 8న ఇండియా కూటమి పక్షాల ఎంపీలతో భేటీ కానుంది. ఓటింగ్‌లో పాల్గొనే విధానంపై ఈ సందర్భంగా మాక్‌పోల్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపీలకు విపక్షాల కూటమి సమాచారం అందించింది. లోక్‌సభ, రాజ్యసభలో కలిపి మొత్తం బలం 786 కాగా, ఇందులో ఆరు ఖాళీలు ఉన్నాయి. ఒక అభ్యర్థి గెలవాలంటే కనీసం 394 ఓట్లు అవసరం.
542 మంది సభ్యులున్న లోక్‌సభలో 293 మంది ఎంపీలు, 240 మంది సభ్యులున్న రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు అధికార కూటమికి ఉంది. 422 మంది ఎంపీల మద్దతుతో ఎన్డీఏ చాలా ముందంజలో ఉంది. విపక్ష ఇండియా కూటమికి 323 సభ్యుల మద్దతు ఉంది. తాజాగా ఆప్ సైతం మద్దతు ప్రకటించింది. ఈ లెక్కన ఆప్‌లోని 11 మంది ఎంపీల బలం కలిస్తే విపక్ష కూటమి బలం 334కు పెరగనుంది. ఇక తటస్థంగా ఉన్న కొన్ని పార్టీలు చివర్లో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఈ సంఖ్య కొంచెం అటు ఇటుగా మారనుంది.