బీజేపీపై మమతా బెనర్జీ ధ్వజం
కోల్‌కతా: భవానీపూర్‌లో తన అభ్యర్థిత్వం చెల్లకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందులో భాగంగా రెండు తప్పుడు కేసుల్లో తనను ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు, టీఎంసీ కార్యకర్తలు వమ్ము చేశారన్నారు. ఆమె శనివారం పశ్చిమ్ మేదినీపూర్ జిల్లాలో జరిగిన టీఎంసీ ప్రచార ర్యాలీల్లో ప్రసంగించారు. ‘ఈసీ సాయంతో భవానీపూర్‌లో నా అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు శుక్రవారం బీజేపీ నాకు వ్యతిరేకంగా రెండు తప్పుడు అఫిడవిట్లు సమర్పించేందుకు కుట్ర పన్నింది.
వారి ప్రయత్నాలను మేం భగ్నం చేశాం’అని ఆమె ప్రకటించారు. భవానీపూర్‌లో మమతకు ప్రధాన ప్రత్యర్థిగా ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి బరిలో ఉండటం తెల్సిందే. సర్ ప్రక్రియ సందర్భంగా బీజేపీ బలవంతంగా ఓటరు జాబితాల్లోని 90 లక్షల ఓటర్ల పేర్లను తొలగించిందని మమత విమర్శించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి నెగ్గే సత్తా లేకనే బీజేపీ దొడ్డిదారిన ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలను అనుకూలంగా మార్చుకునేందుకు ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకూ బీజేపీ పథకం వేస్తోందన్నారు.


