
చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచే వివిధ పార్టీలు ఉత్సాహంగా, తమ ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకేలో పొత్తులో భాగంగా 50కి పైగా సీట్లలో పోటీ చేయాలని భావిస్తోందని సమాచారం.
2021 ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన 20 సీట్ల కంటే ఇది గణనీయమైన పెరుగుదల. నాడు బీజేపీ తమిళనాడులో కేవలం నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఇప్పటికే రెండు పార్టీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే దీనిపై అటు బీజేపీ లేదా ఇటు ఏఐడీఎంకే ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు బీజేపీ మరిన్ని సీట్ల కోసం పట్టుబట్టడం చూస్తుంటే భవిష్యత్ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోందని తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ నాయకత్వం, అన్నాడీఎంకే రాష్ట్ర నాయకత్వంతో ఒకవేళ బీజేపీ కూటమి గెలిస్తే, ప్రభుత్వంలో కీలకంగా చేరాలని చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు నటుడు విజయ్ తన తమిళగా ‘వెట్రీ కజగం’తో రాజకీయాల్లోకి ప్రవేశించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మాట్లాడుతూ తమిళనాడులో 2026 ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాష్ట్రంలో అన్నాడీఎంకే ఎడప్పాడి కె. పళనిస్వామి నాయకత్వంలో జరుగుతాయని ప్రకటించారు.
అయితే బీజేపీ ప్రతిష్టాత్మక సీట్ల డిమాండ్‌కు ఏఐడీఎంకే అంగీకరిస్తుందా ? అనేది ఇప్పడు ప్రశ్నగా మారింది. మరోవైపు నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. విజయ్ ‘తమిళగా వెట్రీ కజగం’ను స్థాపించారు. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఏఐడీఎంకే నంబర్ టూ పార్టీ అని సర్వేలు పలు చెబుతున్నాయి. ‘ఓట్ వైబ్ సర్వే’.. డిఎంకే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నదని, 2026 లో తిరిగి అధికారంలోకి రావచ్చని పేర్కొంది. 2021లో 234 సభ్యుల అసెంబ్లీలో డీఎంకె 159 సీట్లను గెలుచుకుని విజయం సాధించింది.