బీజేపీ అభ్య‌ర్థి కొడుకుతో సూలే కుమార్తె పెళ్లి | BJP candidate Arun Lakhani son gets set to marry Supriya Sule daughter | Sakshi
Sakshi News home page

పారిశ్రామికవేత్త కుమారుడితో సుప్రియా సూలే కుమార్తె పెళ్లి

Jun 1 2026 7:16 PM | Updated on Jun 1 2026 7:23 PM

BJP candidate Arun Lakhani son gets set to marry Supriya Sule daughter

నాగ్‌పూర్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి వివాహం మహారాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అరుణ్ లఖానీ కుమారుడు శరంగ్ లఖానీతో రేవ‌తి వివాహం ఈ నెల 20న జ‌ర‌గ‌నుంది. మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో చంద్రపూర్-వర్ధా-గడ్చిరోలీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన అరుణ్ లఖానీ కుటుంబంతో సుప్రియా సూలే వియ్యమందుకోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతోంది. అయితే రాజ‌కీయాలు, కుటుంబ వ్య‌వ‌హారాలు వేర్వేర‌ని అరుణ్ లఖానీ స్ప‌ష్టం చేశారు.

మహారాష్ట్రలో పెద్ద రాజ‌కీయ కుటుంబ‌మైన ప‌వార్ ఫ్యామిలీతో పెళ్లి సంబంధం క‌లుపుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు. ప‌వార్ కుటుంబంతో త‌మ‌కు బంధుత్వం కూడా ఉంద‌ని తెలిపారు. వేర్వేరు రాజకీయ పార్టీల‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న తాము ఆయా పార్టీల సిద్ధాంతాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. బంధుత్వానికి రాజ‌కీయాల‌కు సంబంధం లేద‌న్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగి ఎంపికైన త‌న‌కు సుప్రియా సూలే అభినంద‌న‌లు చెప్పిన‌ట్టు మ‌రాఠీ న్యూస్ చాన‌ల్‌తో అరుణ్ లఖానీ చెప్పారు.

గెలుపుపై దీమా
ప్ర‌జ‌లు త‌మ కోసం ప‌నిచేసే వారినే ఎన్నుకుంటార‌ని అరుణ్ లఖానీ (Arun Lakhani) అన్నారు. చంద్రపూర్-వర్ధా-గడ్చిరోలీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తాను విజ‌యం సాధిస్తాన‌నే నమ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ప్రజలతో త‌నకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. లక్ష్మణరావు మాంకర్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవ‌కాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

పారిశ్రామికవేత్తలకే బీజేపీ ప్రాధాన్యం
అరుణ్ లఖానీకి బీజేపీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వ‌డంపై కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత విజయ్ వడెట్టివార్ విమర్శలు గుప్పించారు. క్షేత్రస్థాయి కార్యకర్తల కంటే పారిశ్రామికవేత్తలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోందని కౌంట‌ర్ ఇచ్చారు. త‌మ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ఖరారు చేసిందని, పూర్తి స్థాయిలో పోటీకి దిగుతుంద‌న్నారు. తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీ అంతర్గత ఆందోళనలకు సంకేతమని ఆరోపించారు. చంద్రపూర్ స్థానానికి కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ కార్యదర్శి, పలు రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా ఉన్న శైలేంద్ర అగ్రవాల్‌ను అభ్యర్థిగా నిలబెట్టినట్లు విజయ్ వడెట్టివార్ తెలిపారు.

18న ఎన్నికలు
మహారాష్ట్రలో స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన 16 శాసన మండలి స్థానాలకు, నాగ్‌పూర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఉపఎన్నికకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా వ్యవహరించే ఈ ఎన్నికలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement