మహారాష్ట్ర తీరును తప్పుపట్టిన పట్నా ఎస్పీ

Bihar Cop Vinay Tiwari Released From Quarantine In Mumbai - Sakshi

పట్నా ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

ముంబై : బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ మృతిపై బిహార్‌ పోలీసుల విచారణను అడ్డుకుంటున్నారని, ఈ కేసును క్వారంటైన్‌లోకి నెట్టారని మహారాష్ట్ర తీరును బిహార్‌ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ తివారీ తప్పుపట్టారు. బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు తనను క్వారంటైన్‌ చేయలేదని సుశాంత్‌ కేసు విచారణను క్వారంటైన్‌ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైన నేపథ్యంలో కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముంబై చేరుకున్న పట్నా ఎస్పీ వినయ్‌ తివారీని కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా బీఎంసీ అధికారులు క్వారంటైన్‌ చేశారు. ఆగస్ట్‌ 15 వరకూ క్వారంటైన్‌లో ఉండాలని, ఆయనకు బీఎంసీ అధికారులు క్వారంటైన్‌ ముద్ర వేశారు.

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ జోక్యంతో క్వారంటైన్‌ నుంచి తివారీని బీఎంసీ అధికారులు విడుదల చేశారు.క్వారంటైన్‌లో ఉన్న బిహార్‌ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ తివారీని ఆయన స్వరాష్ట్రానికి వెళ్లేందుకు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు అనుమతించారు. కాగా తివారీని విడుదల చేయాలని బిహార్‌ పోలీసులు కోరడంతో క్వారంటైన్‌ గడువుకు వారం ముందుగానే ఆయనను విడుదల చేశామని బీఎంసీ అధికారి తెలిపారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తునకు సంబంధించి రియా  చక్రవర్తి శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు.  తన సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ముంబైలోనీ ఈడీ కార్యాలయానికి చేరుకున్న రియాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. సుశాంత్‌కు చెందిన కోట్లాది రూపాయలను అక్రమంగా దారి మళ్లించినట్టు రియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జూన్‌ 14న బాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబైలోని బాంద్రా నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. చదవండి : ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top