
మోవ్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడి కేవలం క్రూరమైన చర్య మాత్రమే కాదని, భారతదేశాన్ని తీవ్రవాదంలోకి లాగడానికి పాకిస్తాన్ పన్నిన ఒక ప్రణాళికాబద్ధమైన ఉచ్చు అని మేజర్ జనరల్ ఎస్పీ విశ్వసరావు పేర్కొన్నారు. భారతదేశ సైనిక వ్యవహారాల మొదటి త్రి-సేవా సెమినార్ ‘రణ్ సంవాద్ 2025’లో విశ్వసరావు ఈ విధంగా వ్యాఖ్యానించారు.
పహల్గామ్‌లో జరిగిన ఊచకోతను ‘ఉద్దేశపూర్వక రెచ్చగొట్టడం’గా సీనియర్ అధికారి విశ్వసరావు పేర్కొన్నారు. ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందూ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నారని, ‘ప్రధాని మోదీకి ఈ సందేశాన్ని తెలియజేయాలని’ ప్రాణాలతో బయటపడిన వారికి సూచించారని ఆయన అన్నారు. భారతదేశంలో మతపరమైన, రాజకీయ అంతరాలను సృష్టించడమే కాకుండా, భారత్ మరోమారు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించేలా ఆకర్షించడమే పాకిస్తాన్ లక్ష్యం కావచ్చని ఆయన అన్నారు.
ఈ దాడిలో పాకిస్తాన్ సైనిక సంస్థ హస్తం ఉందని మన రక్షణ, నిఘా వర్గాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయని విశ్వసరావు తెలిపారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పన్నిన ఎత్తుగడ ఇది అని అన్నారు. 2019 పుల్వామా దాడి సమయంలో ఐఎస్‌ఐకి నాయకత్వం వహించిన మునీర్.. కశ్మీర్ సమస్యను తిరిగి లేవనెత్తేందుకు చేసిన చర్య ఇది అని విశ్వసరావు పేర్కొన్నారు. భారత దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇటువంటి చర్యలకు పాక్ పాల్పడుతున్నదన్నారు.
దేశంలో జరిగిన రైతుల ఆందోళన, సీఏఏ వ్యతిరేక నిరసనలు, మణిపూర్‌లో కొనసాగుతున్న అశాంతి ఉద్యమాలను మొదలైన అంశాలను శత్రు శక్తులు ఉపయోగించుకుంటున్నాయని విశ్వసరావు అన్నారు. పాక్ అనుసరిస్తున్న వ్యూహాలను బంగ్లాదేశ్ తదితర దేశాలలో కనిపించే వర్ణ విప్లవాలతో విశ్వసరావు పోల్చారు. ఇటువంటి అశాంతి.. భారత దేశాన్ని అంతర్గతంగా బలహీనపరచడానికి దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అప్రమత్తం కావాలని మేజర్ జనరల్ విశ్వసరావు పేర్కొన్నారు.