అయోధ్యలో మసీదు నిర్మాణం: తొలి ఫొటోలు

Ayodhya Futuristic Mosque Hospital Architecture Plan First Photos - Sakshi

లక్నో: అయోధ్య జిల్లాలో సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు తలపెట్టిన మసీదు, ఆస్పత్రి, గ్రంథాలయం నిర్మాణ ప్రణాళికకు సంబంధించిన నమూనా ఫొటోలు తాజాగా విడుదలయ్యాయి. వచ్చే ఏడాది శంకుస్థాపన చేసి, మొదటి దశలో భాగంగా మసీదు, ఆస్పత్రి నిర్మాణం చేపట్టి, రెండో దశలో ఆస్పత్రిని విస్తరించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అయోధ్యలోని ధానీపూర్‌లో గల ఐదెకరాల స్థలంలో వీటిని నిర్మించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ మసీదుల డిజైన్లను పరిశీలించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఇండో ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌(ఐఐసీఎఫ్‌) ట్రస్టు పేర్కొంది. (చదవండి: 1992 డిసెంబర్‌ 6న ఏం జరిగింది ?)

ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రొఫెసర్‌ ఎస్‌ఎం అక్తర్‌ ఈ బిల్డింగు డిజైన్లను రూపొందించినట్లు పేర్కొంది. ఇక మ్యూజియంతో పాటు ఇండో ఇస్లామిక్‌ సంస్కృతీ సాహిత్యాలపై పరిశోధనలు చేసే విధంగా ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాగా అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం విదితమే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు స్థలం కేటాయించింది. ఇక ఈ స్థలాన్ని స్వీకరించేందుకు సుముఖత వ్యక్తం చేసిన సున్నీ వక్ఫ్‌బోర్డు.. మసీదు నిర్మాణానికై ఐఐసీఎఫ్‌ను ట్రస్టు ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా.. రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగష్టులో భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top