పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి. అయితే, ప్రముఖ సంస్థ యాక్సిస్ మై ఇండియా (Axis My India) మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయబోమని ప్రకటించింది. బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌ను ఎందుకు విడుదల చేయలేదో చెప్పింది యాక్సిస్ మై ఇండియా.
ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. దాదాపు 60-70 శాతం మంది ఓటర్లు సర్వేలో తమ అభిప్రాయాన్ని చెప్పడానికి నిరాకరించారు. ప్రజలు తమ మనసులో ఏముందో వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో మౌనమే ప్రధాన అవరోధంగా మారిందంటూ చెప్పుకొచ్చారు. ఎందుకో బెంగాల్ ఓటర్లు మాత్రం గుంబనంగా ఉన్నారని తెలిపారు. కేవలం 20-30 శాతం మంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను అంచనా వేయడం శాస్త్రీయంగా సరైనది కాదని.. అది సరైన ఫలితాన్ని ప్రతిబింబించదని సంస్థ భావించిందని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌పై బీజేపీ స్పల్ప ఆధిక్యత సాధిస్తుందని మాట్రిజ్, పి–మార్క్ ఫలితాలు తెలియజేశాయి. టీఎంసీకి 125–140 స్థానాలు వస్తాయని, బీజేపీకి 146–161 స్థానాలు లభిస్తాయని మాట్రిజ్ వెల్లడించింది. పి–మార్క్ అంచనా ప్రకారం బీజేపీకి 150–174 సీట్లు, టీఎంసీకి 118–138 సీట్లు లభిస్తాయి. బీజేపీకి 142–171, టీఎంసీకి 99–127 సీట్లు లభించేందుకు ఆస్కారం ఉన్నట్లు ‘పోల్ డైరీ’ఎగ్జిట్ పోల్ తేల్చింది.
తృణమూల్ కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలు మరియు సంస్థాగత బలంతో బీజేపీ సవాల్‌ను తట్టుకుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని సర్వేలు బీజేపీ భారీ విజయంతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనా వేస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ కూటమి ఈసారి కూడా ఒక అంకె (సింగిల్ డిజిట్) స్థానాలకే పరిమితం కావచ్చని మెజారిటీ పోల్స్ అభిప్రాయపడ్డాయి. యాక్సిస్ మై ఇండియా వంటి అనుభవజ్ఞులైన సంస్థ కూడా అంచనా వేయలేకపోయిందంటే.. బెంగాల్ ఓటరు తీర్పు ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.


