బెంగాల్‌లో రేపు 152 నియోజకవర్గాల్లో పోలింగ్
బందోబస్తు కోసం 2.5 లక్షల బలగాలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లకు గాను ఈ నెల 23వ తేదీన 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో 3.60 కోట్ల అర్హులైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ భారీగా భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. మొదటి విడతలో 8 వేల పోలింగ్ బూత్‌లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించింది. పోలింగ్ సజావుగా సాగేందుకు సుమారు 2,450 కంపెనీలు, రెండున్నర లక్షల కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. అదనంగా 2,193 క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలోని మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్‌పూర్, కూచ్ బెహార్, బిర్బూమ్, బురŠాద్వన్ జిల్లాలపై ఈసీ ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. మొదటి విడతలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్, కేంద్ర మాజీ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పోటీలో ఉన్న మాతాభంగ, కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్న బెహరంపూర్ తదితర నియోజకవర్గాలున్నాయి. పశ్చిమ్ మేదినీపూర్ జిల్లా ఖరగ్‌పూర్ సదర్‌లో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, టీఎంసీకి చెందిన ప్రదీప్ సర్కార్ ముఖాముఖి తలపడుతున్నారు. ఈ నెల 29వ తేదీన రెండో విడత పోలింగ్, మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నాయి.
టీఎంసీ, బీజేపీ మధ్యే అసలు పోటీ
టీఎంసీ వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టేందుకు చెమటోడ్చుతుండగా, మమతా బెనర్జీని గద్దె దించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియతో 91 లక్షల ఓట్లు తొలగింపునకు గురి కావడం తమకు కలిసి వస్తోందని కాషాయ దళం ఆశతో ఉంది. మొదటి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల హింస, దిగజారిన శాంతి భద్రతల అంశం, పెచ్చుమీరిన అవినీతిపై సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను టీఎంసీ ప్రోత్సహిస్తోందని వీరు ఆరోపణలు గుప్పించారు. కాగా, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సర్ ద్వారా బీజేపీ ఓటరు జాబితాను తారుమారు చేసి, అనుకూలంగా మార్చుకుందని వీరు విమర్శించారు. కేంద్ర విభాగాలను వాడుకుంటూ బీజేపీ నాయకులు తమ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే చేపలు, గుడ్లు, మాంసంపై నిషేధం తీసుకువస్తుందని, ప్రజల ఆహార అలవాట్లను కూడా శాసిస్తుందని ప్రజలను టీఎంసీ హెచ్చరించారు. కాగా, కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌తోపాటు గతంలో దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న సీపీఎం ప్రభావం కూడా అంతంత మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు.


