5జి కాల్‌ విజయవంతం.. ఇంత కాలానికా?

Ashwini Vaishnaw, Salil Tripathi, Celebrities Social Media Comments - Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! 


బలహీనత మంచిదా?

ఇండియాలో 1991లో పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలో సరళీకరణ మొదలై, రూపాయి పతనమైంది. సింగపూర్‌లో జరిగిన ఒక పెట్టుబడుల సదస్సులో ప్రసిద్ధ పెట్టుబడుల బ్యాంకర్‌ను ఆ పతనం గురించి అడిగాను. అది మనకేమీ మంచి చేయదని చెప్పారు. ‘కానీ అది ఎగుమతులకు మంచిది కదా?’ అని నేను ప్రశ్నించాను. ఆయన నవ్వి, ‘బలమైన దేశాలు బలహీన కరెన్సీ కలిగివున్నాయా?’ అన్నారు. కానీ దీన్నే మీరు ‘భక్తానమిస్టులను’ అడిగితే, బలహీన రూపాయి మంచిదని చెబుతారు.
– సలీల్‌ త్రిపాఠీ, కాలమిస్ట్‌


ఏం జరగనుంది?

ఇప్పుడు ట్విట్టర్‌ డీల్‌ నుంచి బయటపడాలని వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ చూస్తున్నాడు; కానీ దాన్ని కొనాల్సిందేనని ట్విట్టర్‌ పట్టుబడుతోందా? ఇప్పుడున్న పరిస్థితిని నేను సరిగ్గానే అంచనా వేస్తున్నానా? ఏంటో ఈ చీదర వ్యవహారాన్ని నేను ఫాలో కాలేకపోతున్నాను. 
– తిమ్మిన్‌ గెబ్రూ, కంప్యూటర్‌ సైంటిస్ట్‌


తెలియాల్సింది తెలుసు

ప్రపంచం గురించి శాస్త్రవేత్తలకు ఏం తెలుసో అది అబ్బురపరుస్తుంది. ప్రపంచం గురించి శాస్త్రవేత్తలకు ఏం తెలియదని జనం అనుకుంటారో అది ఆందోళన కలిగిస్తుంది.
– నీల్‌ డెగ్రాస్‌ టైసన్, ఆస్ట్రో ఫిజిసిస్ట్‌


వ్యతిరేకతా మంచికే!

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ అవకాశవాద హడావిడి వల్ల, ‘నాటో’ కూటమిలో ఫిన్‌లాండ్, స్వీడన్‌లను చేర్చుకోవాలన్న పిచ్చి నిర్ణయం గనక నెమ్మదిస్తే– ప్రత్యేకించి రష్యాతో ఫిన్‌లాండ్‌కు సుదీర్ఘ సరిహద్దు ఉన్న నేపథ్యంలో– ఆయన ప్రపంచానికి సేవ చేస్తున్నట్టే.     
– అజము బరాకా, యాక్టివిస్ట్‌


ఆత్మనిర్భర్‌ 5జి

ఐఐటీ మద్రాసులో 5జి కాల్‌ను విజయవంతంగా పరీక్షించడమైంది. ఈ ‘ఎండ్‌ టు ఎండ్‌’ నెట్‌వర్క్‌ మొత్తం రూపకల్పన, అభివృద్ధి ఇండియాలోనే జరిగింది.
– అశ్వినీ వైష్ణవ్, కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి


ఇంత కాలానికా?

బిహార్‌ కోర్టు 108 ఏళ్ల నాటి ఒక కేసులో తీర్పునిచ్చింది. అది ఆరా సివిల్‌ కోర్టులో 1914 సంవత్సరానికి సంబంధించిన ఒక భూవివాదం కేసు. ఓ నా ప్రియమైన దేశమా, దుఃఖపడు!
– ప్రకాశ్‌ సింగ్, పోలీస్‌ మాజీ ఉన్నతాధికారి


ఇదేనా పరిష్కారం?

సైబర్‌ దాడుల మీద జరుగుతున్న ఒక చర్చలో, ఆ దాడిని నిరోధించడానికి గానూ మహిళలు తమ ఫొటోలను ఆన్‌లైన్‌లో పోస్టు చేయకూడదని ఒకాయన చెప్పే అభిప్రాయాన్ని అతిథులు అనుమతించారు. హ్మ్‌!
– హనా మొహిసిన్‌ ఖాన్, పైలట్‌


అలవాటైతే అంతే!

కాఫీ చేదుగా ఉంటుంది సరే, కానీ నెమ్మదిగా నువ్వు ఆ చేదుకు అలవాటు పడతావు.
– ఐశ్వర్యా ముద్గిల్, వ్యాఖ్యాత

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top