జయలలిత మృతిపై వెలుగులోకి కొత్త అంశం

Arumughaswamy Starts Probe On Jayalalithaa Deceased Case After Three Years - Sakshi

అనారోగ్యంతోనే ప్రమాణ స్వీకారం

మూడేళ్ల అనంతరం విచారణకు ఆర్ముగ స్వామి కమిషన్‌ శ్రీకారం 

సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో (2016) విజయానందం దివంగత సీఎం జయలలితకు ఎంతో సేపు మిగల్చలేదనే విషయం తాజాగా వెలుగు చూసింది. ఆరోగ్యం బాగో లేకున్నా.. తాత్కాలిక ఉపశమనం పొందే మందులను తీసుకుని ఆమె ప్రమాణ స్వీకారానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్ముగస్వామి కమిషన్‌ ముందు నలుగురు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. దివంగత సీఎం జయలలిత మరణం మిస్టరీ నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్‌ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

ఆదిలో శరవేగంగా విచారణ సాగినా, అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మూడేళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు విచారణ ఆగింది. ఎట్టకేలకు సుప్రీం ఆదేశాలతో సోమవారం విచారణ ముమ్మరం చేసింది. ఢిల్లీ నుంచి ఎయిమ్స్‌ వైద్య బృందం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  సహకారం అందించారు.  

విశ్రాంతి తీసుకోవాలన్నా.. 
తొలిరోజు విచారణకు అపోలో నుంచి నలుగురు వైద్యులు విచారణకు వచ్చారు. జయలలిత ఆస్పత్రికి వచ్చిన సమయంలో స్పృహలో లేరని పేర్కొంటూ, ఆమెకు అందించిన చికిత్స వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జయలలిత నెచ్చెలి, చిన్నమ్మశశికళ తరపు న్యాయవాది రాజా చెందూర్‌పాండియన్‌ ఈ వైద్యుల వద్ద క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాబు మనోహర్‌ కొత్త విషయాన్ని కమిషన్‌ ముందు ఉంచినట్టు వెలుగు చూసింది.

ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత జయలలిత వ్యక్తిగత వైద్యుడు శివకుమార్‌ తనను సంప్రదించినట్లు బాబు మనోహర్‌ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు కూడా కళ్లు తిరగడం, నీరసంగా ఉండటం, ఎవరో ఒకరి సాయం లేకుండా నడవ లేకపోవడం వంటి సమస్యలు జయలలిలలో గుర్తించినట్లు తెలిపారు.

తాత్కాలిక చికిత్సతో ఎక్కువ సమయం విశ్రాంతి అవసరం అని జయలలితకు సూచించగా.. రోజుకు 16 గంటలు తాను ప్రజల కోసం శ్రమించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నట్టుగా తెలిసింది. ఇక, మరో ఏడుగురు వైద్యులు మంగళవారం విచారణకు రానున్నారు. వీరందర్నీ రాజా చెందూర్‌ పాండియన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసే అవకాశం ఉంది.

అనారోగ్యంతోనే ‘అమ్మ’ మరణం: దినకరన్‌ 
అమ్మ జయలలిత అనారోగ్యంతోనే మరణించారని, అయితే, దీనిని రాజకీయం చేశారని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ అన్నారు. సోమవారం చెన్నైలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణన్‌ గతంలోనే అమ్మ మరణం గురించి స్పష్టమైన వివరాలు ఇచ్చారని, అపోలో వైద్యులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిపారు.

రాధాకృష్ణన్‌ నిజాయితీ గల అధికారి అని, అందుకే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా,  ఆయనకు  ఆరోగ్య శాఖ కార్యదర్శి పదవిని అప్పగిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అనారోగ్యంతోనే అమ్మ మరణించారని, అయితే, దీనిని రాజకీయం చేసి, విచారణ కమిషన్‌ పేరిట ప్రజాధనాన్ని దుర్విని యోగం చేస్తున్నారని ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top