విమానం మేఘాల్లోకి రసాయన మిశ్రమాన్ని వెదజల్లుతున్న దృశ్యం
వాయు కాలుష్య భూతానికి వర్షాలతో చెక్ పెట్టాలని యోచన
పలు చోట్ల పూర్తయిన ట్రయల్స్
న్యూఢిల్లీ: దేశరాజధానిగా మాత్రమే కాదు కాలుష్య రాజధానిగానూ మారిన ఢిల్లీలో వాయు కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని రేఖా గుప్తా సారథ్యంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. అనుకున్నదే తడవుగా మేఘాలను చల్లబరిచి వర్షింపజేసే రసాయనాలను చల్లే విమానాలను రంగంలోకి దింపింది. ఐఐటీ–కాన్పూర్ సహకారం, సమన్వయంతో మంగళవారం రాజధానిలో మేఘావృత గగనతలంలో మేఘమథన క్రతువుకు శ్రీకారం చుట్టింది.
మరికొన్ని రోజులపాటు ఈ విమానాలు రసాయనాలను వెదజల్లే ప్రక్రియ కొనసాగుతుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మన్జీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. వర్షించని మేఘాల నుంచి చినుకులు కురిసేలా చేసే ఈ ప్రక్రియను సాధారణంగా క్లౌడ్–సీడింగ్ అంటారు. అయితే ఇది వాయుకాలుష్యానికి తాత్కాలిక ఉపశమనంగా పనిచేస్తుందని, ఖరీదైన ఈ ప్రక్రియను శాశ్వత పరిష్కారంగా భావించకూడదని పలువురు పర్యావరణవేత్తలు పెదవి విరుస్తున్నారు.
కాన్పూర్ నుంచి ఢిల్లీకి..
ఢిల్లీ స్థానిక ప్రాంతాలను కృత్రిమ వర్షాలతో తడిసి ముద్దచేసేందుకు ప్రత్యేక విమానాలు మంగళవారం కాన్పూర్ నుంచి బయల్దేరాయి. ఢిల్లీలోని బురారీ, నార్త్ కరోల్ బాగ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాల మీది మేఘాలపై ఈ విమానాలు సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ మిశ్రమాలను చల్లాయి. దీంతో మేఘాలు చల్లబడి అందులోని తేమ చినుకులుగా మారి వర్షిస్తుంది. ‘‘దాదాపు 20 శాతం తేమ ఉన్న మేఘాలను కృత్రిమ వర్షాల కోసం ఎంపికచేశాం. సెస్నా రకం విమానం ఒక్కోటి 2–2.5 కేజీల బరువైన రసాయన మిశ్రమాన్ని వేర్వేరు చోట్ల వెదజల్లింది.
దాదాపు 8 ప్రాంతాల్లో క్లౌడ్–సీడింగ్‌ను చేపట్టాం. సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ ప్రభావానికి గురైన మేఘాలు కనిష్టంగా 15 నిమిషాల నుంచి గరిష్టంగా 4 గంటల్లోపు వర్షిస్తాయి. గాలులు ఉత్తర దిక్కుగా వీస్తున్నాయని ఢిల్లీ దిశగా వచ్చే మేఘాలనే లక్ష్యంగా చేసుకుని ట్రయల్స్ చేపడుతున్నాం. మరికొద్దిరోజుల్లో కనీసం 10 సార్లు ట్రయల్స్ చేస్తాం. ట్రయల్స్ విజయశాతం ఎక్కువగా ఉంటే ఫిబ్రవరిలో శాశ్వత ప్రాతిపదికన ఈ మేఘమథన కార్యక్రమం కొనసాగిస్తాం. నగరాల్లో భారీ వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు దేశంలోనే ఇదొక ముందడుగు అవుతుంది ’’ అని మంత్రి మన్జీందర్ వ్యాఖ్యానించారు.


