సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే వర్గాలలో మంచి జోష్ నింపే విధంగా తాజాగా ఏఎన్‌ఎస్ సర్వే వివరాలు వెలుగు చూశా యి. ఇందులో తమిళనాడులో మళ్లీ డీఎంకే ప్రభంజనం సృష్టించబోతున్నట్టుగా సమాచారం వెలువడింది. తాజా సర్వే గణాంకాల ప్రకారం ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 178 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోనుందని ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులే సమయం ఉంది. ఎన్నికలకు ముందుగా వెలువడ్డ అనేక సర్వేలు డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి. అదే సమయంలో ఎన్నికల నగారా మోగినానంతరం ప్రచార హోరు నేపథ్యంలో అన్నాడీఎంకేకు సైతం అనుకూలంగా సర్వేలు రావడంతో ఉత్కంఠ తప్పలేదు. అదే సమయంలో టీవీకే అధినేత విజయ్ కీలక శక్తిగా మారనున్నట్టుగా సర్వేలు పేర్కొంటూ వచ్చాయి. ఓటరు నాడి ఎటు అన్న ఉత్కంఠ నేపథ్యంలో తాజాగా వెలువడ్డ ఈ సర్వే వివరాలను డీఎంకే అనుకూల పత్రిక ప్రకటించింది.
జోన్ల వారీగా అంచనాలు
సర్వే నివేదిక ప్రకారం వివిధ ప్రాంతాల్లో డీఎంకే కూటమి పరిస్థితిని వివరించారు. ఇందులో చెన్నై జోన్‌లో 37 నియోజకవర్గాలకు డీఎంకే కూటమి 36 స్థానాల్లో పటిష్టంగా ఉండగా, అన్నాడీఎంకే ఒకే స్థానానికి పరిమితం కానున్నట్టు ప్రకటించారు. సెంట్రల్ జోన్‌లో 37 స్థానాల్లో 35 చోట్ల డీఎంకే గెలుస్తుందని సర్వేలో తేల్చారు. దక్షిణ జోన్‌లో 58 స్థానాలకు గాను 42 స్థానాల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు ప్రకటించారు.
జిల్లా వారీగా క్లీన్ స్వీప్
అనేక జిల్లాల్లో డీఎంకే కూటమి 100 శాతం సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో వివరించారు. ఆ మేరకు చెన్నై జిల్లాలో 16 సీట్లు, తిరువళ్లూరు జిల్లాలో 10 సీట్లు, తంజావూరు 8 సీట్లు, కాంచీపురం 11 సీట్లు, నీలగిరి, కరూర్, తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లోని అన్ని సీట్లను డీఎంకే గెలుచుకునే అవకాశం ఉందని ఆ సర్వే ద్వారా వివరించారు.
విజయ్ ప్రభావం
ఓట్ల శాతం పరంగా ఈసారి రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారుతుందని ప్రకటించారు. డీఎంకే కూటమి 45.4 శాతం, అన్నాడీఎంకే కూటమి 35.3 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని వివరించారు. అయితే, నటుడు విజయ్ టీవీకే 11.5 శాతం ఓట్లు, సీమాన్ ఎన్‌టీకే 5.6 శాతం ఓట్లను దక్కించుకోనున్నట్టు పేర్కొన్నారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా, సర్వే ప్రకారం డీఎంకే 178 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా అవతరించనున్నదని, అన్నాడీఎంకే 56 సీట్ల వద్ద నిలిచిపోయే అవకాశం ఉందని తాజా సర్వే పేర్కొంది. అయితే తుది ఓటరు తీర్పు అన్నది మే 4న వెలువడే ఫలితాల మేరకు ఉండబోతుండడం గమనార్హం. ఈ సర్వే తమకు అనుకూలంగా ఉండడంతో డీఎంకే వర్గాలలో జోష్ పెరిగింది. గెలుపు దిశగా మరింత ఉత్సాహంతో ప్రచారంచేసే పనిలో పడ్డారు.


