కేంద్రం నిర్ణ‌యంపై అన్నామ‌లై అభ్యంత‌రం | Annamalai opposes mid session implementation of Centre 3 language rule | Sakshi
Sakshi News home page

త్రిభాషా సూత్రం అమ‌లుపై అన్నామ‌లై అభ్యంత‌రం

May 26 2026 5:37 PM | Updated on May 26 2026 6:29 PM

Annamalai opposes mid session implementation of Centre 3 language rule

చెన్నై: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన త్రిభాషా సూత్రం అమ‌లుపై  త‌మిళ‌నాడు బీజేపీ మాజీ అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే మూడు భాషలు అభ్యసించాలని ఒత్తిడి చేయ‌డం స‌రికాద‌న్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) జారీ చేసిన ఉత్త‌ర్వులను ఉప‌సంహ‌రించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. గ‌తంలో జారీ చేసిన ఉత్త‌ర్వుల‌కు భిన్నంగా సీబీఎస్‌ఈ వ్య‌వ‌హ‌రించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. హఠాత్తుగా కొత్త విధానం తీసుకురావడం తమిళనాడులోని విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని 'ఎక్స్‌'లో పేర్కొన్నారు.

పాఠ‌శాల‌ల్లో త్రిభాషా సూత్రం అమ‌లు చేయ‌డానికి తాను వ్య‌తిరేకం కాద‌ని, కానీ తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే మూడు భాషలు అభ్యసించాలని ఒత్తిడి చేయ‌డం త‌గ‌ద‌ని హిత‌వు పలికారు. తక్కువ సమయంలోనే ఒక కొత్త భాషను నేర్చుకోవాలని పిల్ల‌ల‌పై ఒత్తిడి చేస్తే వారి చ‌దువుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌తంలో చెప్పిన‌ట్టుగానే 2029 నుంచే తొమ్మిదవ తరగతి విద్యార్థులకు త్రిభాషా సూత్రం అమ‌లు చేయాల‌ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను కోరారు.

''ఆరో త‌ర‌గ‌తి నుంచే విద్యార్థులు మూడు భాష‌లు నేర్చుకోవాల‌ని, వాటిలో రెండు భారతీయ భాష‌లు ఉండాలని ఏప్రిల్‌లో సీబీఎస్‌ఈ చేసిన ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించిన వారిలో నేనూ ఒకడిని. ఈ నిర్ణయం వల్ల పిల్లలు చిన్న వయస్సు నుంచే అనేక భాషలను నేర్చుకోవడానికి వీలవుతుంది. భారతదేశపు విభిన్న సాహిత్య ప్రపంచంపై వారి అవగాహనను విస్తృతం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. సీబీఎస్ఈ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థుల‌కు మూడో భాషను 2029-30 విద్యా సంవత్సరం నుంచి మాత్రమే తప్పనిసరి చేస్తామని ఆ ఉత్త‌ర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

అయితే ఈనెల 15న తన అనుబంధ పాఠశాలలన్నింటికీ సీబీఎస్‌ఈ పంపిన ఉత్త‌ర్వుల్లో ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే తొమ్మిదవ తరగతి విద్యార్థులు కొత్త‌గా మూడో భాష‌ను నేర్చుకోవాల‌ని ఆదేశించారు. దీని ప్ర‌కారం జూలై 1 నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు త‌ప్ప‌స‌రిగా మూడు భాషలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో కొత్త భాష నేర్చుకోవాలంటే ఒత్తిడి పెరుగుతోంది. ఫ‌లితంగా విద్యార్థుల చ‌దువుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. సీబీఎస్‌ఈ తాజాగా వెలువ‌రించిన ఉత్త‌ర్వులు తమిళనాడులోని విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. త‌క్ష‌ణ‌మే ఈ ఉత్త‌ర్వుల‌ను వెనక్కి తీసుకోవాలి. గ‌త ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న‌ట్టుగానే 2029-30 విద్యా సంవత్సరం నుంచే తొమ్మిదవ తరగతికి త్రిభాషా సూత్రం అమ‌లు చేయాల‌ని కేంద్ర‌ విద్యా మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తున్నాన''ని అన్నామ‌లై ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. 

ఏమిటీ త్రిభాషా సూత్రం?  
జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాలి. వీటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఈ త్రిభాషా సూత్రం వర్తిస్తుంది. ఏయే భాషలు బోధించాలన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చు. ఫలానా భాష కచ్చితంగా ఉండాలన్న బలవంతం ఏమీ లేదు. త్రిభాషా సూత్రం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని సీబీఎస్‌ఈ వెల్లడించింది. విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమై, తరగతులు జరుగుతున్నాయి. మొదటి యూనిట్‌ పరీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 9వ తరగతికి త్రిభాషా సూత్రం అమలుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

చ‌ద‌వండి: త‌మిళ‌నాడు ఏఐ మంత్రి ఆయ‌నే

Advertisement
 
Advertisement
Advertisement