త‌మిళ‌నాడు ఏఐ మంత్రి ఆయ‌నే | Tamil Nadu Artificial Intelligence Minister R Kumar | Sakshi
Sakshi News home page

త‌మిళ‌నాడులో తొలిసారిగా ఏఐ మంత్రి

May 21 2026 6:12 PM | Updated on May 21 2026 7:36 PM

Tamil Nadu Artificial Intelligence Minister R Kumar

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించారు. కొత్త‌గా 23 మందికి త‌న కేబినెట్‌లో స్థానం క‌ల్పించారు. తమిళగ వెట్రి కళ‌గం (టీవీకే) నుంచి 21 మంది, కాంగ్రెస్ నుండి ఇద్దరు శాసనసభ్యులను మంత్రి వ‌ర్గంలో చేర్చుకున్నారు. లోక్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వీరితో గ‌ర్న‌వ‌ర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం విజ‌య్‌,  ప్రభుత్వ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాయికుమార్ పాల్గొన్నారు. 

కొత్త‌గా చేరిన మంత్రుల‌తో త‌మిళ‌నాడు కేబినెట్‌లోని స‌భ్యుల సంఖ్య 33కి చేరింది. మంత్రివర్గ విస్త‌ర‌ణ జ‌ర‌డంతో ఇంత‌కుముందు ఉన్న మంత్రుల శాఖ‌ల్లో మార్పులు చేశారు. కొత్త‌గా చేరిన మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించారు. సీఎం విజ‌య్ కూడా త‌న ద‌గ్గ‌రున్న కొన్ని శాఖ‌ల‌కు కొత్త మంత్రుల‌కు బ‌దిలీ చేశారు. 

ఎన్నిక‌ల్లో హామీయిచ్చిన‌ట్టుగానే ప్ర‌త్యేకంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రిత్వ శాఖ‌ను తొలిసారిగా ఏర్పాటు చేశారు. డాక్ట‌ర్‌ ఆర్ కుమార్‌కు ఈ శాఖ‌ను కేటాయించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ శాఖ‌ను కూడా ఆయ‌నకే అప్ప‌గించారు. దేశంలోనే తొలి ఏఐ మంత్రిగా ఆర్ కుమార్ గుర్తింపు పొంద‌నున్నారు. వేలచ్చేరి నియోజకవర్గానికి ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 

కాంగ్రెస్‌కు కీల‌క శాఖ‌లు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్‌. రాజేశ్‌కుమార్‌, పి. విశ్వ‌నాథ‌న్ మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. దీంతో 59 ఏళ్ల త‌ర్వాత త‌మిళనాడు కేబినెట్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం ద‌క్కింది. రాజేశ్‌కుమార్ ప‌ర్యాట‌క శాఖ‌, విశ్వ‌నాథ‌న్‌కు ఉన్న‌త‌విద్య శాఖ కేటాయించారు. 

ఇది ఊహించ‌లేదు: ఐయూఎంఎల్
త‌మ‌ను మంత్రి వ‌ర్గంలో చేర‌మ‌ని సీఎం విజ‌య్ ఆహ్వానిస్తార‌ని ఊహించ‌లేద‌ని ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిదీన్ అన్నారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే ప్ర‌భుత్వానికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చామ‌ని, మంత్రి పదవుల కోసం తాము అడ‌గ‌లేద‌ని చెప్పారు. టీవీకే ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క‌పోతే గవర్నర్ పాలన వస్తుందని, త‌ద్వారా బీజేపీ పెత్త‌నం చెలాయిస్తుంద‌నే ఉద్దేశంతోనే విజ‌య్‌కు మద్ద‌తు ఇచ్చిన‌ట్టు వెల్ల‌డించారు. కాగా, ప్రభుత్వంలో చేరడానికి యూఎంఎల్ అంగీకరించిన‌ట్టు తెలుస్తోంది. మంత్రి పదవికి తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని స‌మాచారం. కాగా, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) అధికార పక్షంలో భాగం కావాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణ‌యం   వెల్ల‌డించ‌లేదు.

చ‌ద‌వండి: యూపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement