
తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం అభివృద్ధిపై సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా తీరంలో ప్రపంచ అయ్యప్ప భక్తుల సంగమాన్ని ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. శనివారం (సెప్టెంబర్ 20) జరగనున్న ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని కేరళ దేవాదాయశాఖ మంత్రి వి.ఎన్. వాసవన్ తెలిపారు. ఈ మహా సంగమంలో వివిధ దేశాల నుంచి సుమారు 3000 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
విరాళాలుగా వచ్చిన రూ.7కోట్లతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వాసవన్ చెప్పారు. ఈ కాంక్లేవ్‌లో కేరళ ప్రభుత్వం శబరిమల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూ. 1300 కోట్ల మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు (KIIFB) ద్వారా నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు ప్రపంచ అయ్యప్ప భక్తుల సంగమం శబరిమల అభివృద్ధి, ఆచార సంప్రదాయాల పరిరక్షణ,భక్తుల సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.