Akkiraju Rama Krishna: నాన్న బాటలోనే మున్నా

సాక్షి, అమరావతి: తండ్రి ఆశయాలకు ఆకర్షితుడైన ఆర్కే కుమారుడు పృథ్వీ (మున్నా) కూడా 16వ ఏటనే (2004 చర్చల అనంతరం) దళంలో చేరాడు. ఏవోబీలో సెక్షన్ కమాండర్‌గా ఎదిగాడు. అయితే 2016 అక్టోబర్ 24న ఏవోబీ రామ్‌గూడాలో పోలీసులు జరిపిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆ ఎన్‌కౌంటర్ సమయంలో ఆయన తన తండ్రి ఆర్కే అంగరక్షక దళ సభ్యుడిగా ఉన్నారు. అందులో బుల్లెట్ గాయమైన ఆర్కే తప్పించుకోగా.. మున్నా ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మావోయిస్టు కీలక నేత కావడంతో మున్నా బాల్యం అత్యంత నిర్బంధంలో గడిచింది.
ఆర్కే ఆచూకీ చెప్పమంటూ ఇంటిపై పోలీసుల దాడులు భయభ్రాంతులకు గురిచేసేవి. ఈ క్రమంలో అతడిని ఒంగోలులో రహస్యంగా చదివించారు. నాన్న కోసం తల్లితో పాటు మున్నా అడవికి వెళ్లినప్పుడల్లా కాంటాక్ట్ దొరకక ఒకోసారి రెండు మూడు నెలలు గిరిజనులతోపాటే అడవిలోనే గడపాల్సి వచ్చేది. అక్కడ తన లాంటి పిల్లలు పడుతున్న కష్టాన్ని చూసిన మున్నా బాధపడేవాడు. ఒకానోక రోజు మున్నా తన నాన్న ఆర్కేను తల్లితో పాటు అడవిలో కలుసుకున్నాడు. అమ్మతో కొద్ది రోజులు అక్కడే ఉంటానన్నాడు. ఆ కొద్ది రోజులూ చాలా రోజులు అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే మున్నాని ఉద్యమంలోనికి ఆహ్వనించింది ఆర్కేనే అంటారు. తన కొడుకు అందరిలా ఏ డాక్టరో, ఇంజనీరో కావాలని ఆయన కోరుకోలేదు. తన కొడుకుకు తనలా ప్రపంచ ప్రజలను ప్రేమించడం నేర్పాలని కలలు కన్నాడు. అదే విషయాన్ని భార్యకు ఉత్తరాల్లోనూ రాసేవాడు. మున్నాను మావోయిస్ట్ సైన్యానికే యుద్ధతంత్రాలు నేర్పేంతగా తీర్చిదిద్దాడు.