కరీంనగర్ : జీవన్‌రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని అనుకుంటున్నానని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలతో జీవన్ రెడ్డి మనస్థాపం చెంది ఉండవచ్చని, ఆయన మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదన్నారు.
ఈ మేరకు జీవన్‌రెడ్డి రాజీనామా చేస్తారని నిర్ణయంపై సాక్షీ టీవీతో శ్రీధర్‌బాబు మాట్లాడారు. జీవన్ రెడ్డికి భవిష్యత్ లో న్యాయం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ చెప్పారని, పార్టీ ఆదేశం మేరకే ఆయనతో చర్చలు జరిపామన్నారు. తప్పకుండా జీవన్‌రెడ్డి పునరాలోచన చేస్తారని అనుకుంటున్నానన్నారు.
కాగా, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్‌లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది.
కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోసం ఇప్పటికే ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం.. జగిత్యాలకు చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, మేడిపెల్లి సత్యం భేటీ అయ్యారు.


