నేనేమైనా తీవ్రవాదినా..? | AIADMK Leader Jayakumar Released From Prison Tamilnadu | Sakshi
Sakshi News home page

నేనేమైనా తీవ్రవాదినా..?

Mar 13 2022 7:40 AM | Updated on Mar 13 2022 7:40 AM

AIADMK Leader Jayakumar Released From Prison Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: ‘నేను తీవ్ర వాదినా..?’ అని మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్‌ నేత జయకుమార్‌ ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. ఆ విధంగా తనను జైలులో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్‌ లభించడంతో శనివారం ఆయన జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. డీఎంకే నాయకుడిపై దాడి, అనుమతి లేకుండా ఆందోళన, స్థల కబ్జా తదితర కేసుల్లో జయకుమార్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయనకు శుక్రవారం హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఇందుకు తగ్గ ఉత్తర్వులు శనివారం ఉదయం జైళ్ల శాఖకు చేరింది. దీంతో ఆయన్ను విడుదల చేశారు. బయటకు వచ్చిన ఆయనకు అన్నాడీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. పట్టినంబాక్కంలోని ఇంటి వద్ద మద్దతుదారులు హంగామా సృష్టించారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం (ఓపీఎస్‌), కో కన్వీనర్‌ పళని స్వామి(ఈపీఎస్‌), సీనియర్లు సీవీ షణ్ముగం, విజయభాస్కర్, దళవాయి సుందరం తదితర నేతలు ఇంటికి చేరుకుని జయకుమార్‌ను పరామర్శించారు.  

వేధించారు.. 
ఓ తీవ్రవాది తరహాలో తనతో పోలీసులు వ్యవహరించారని జయకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనను అరెస్టు చేసిన రోజు కోర్టులో హాజరుపరచకుండా, ఎక్కడికెక్కడో వాహనంలో తిప్పారని ఆరోపించారు. తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను బంధించే పూందమల్లి జైల్లో తనను తీసుకెళ్లి పడేశారని వాపోయారు. చుట్టూ సీఆర్‌పీఎఫ్‌ బలగాల మధ్య జైల్లో నేలపై పడుకోవాల్సి వచ్చిందని ఉద్వేగానికి లోనయ్యారు. పలు మార్లు మంత్రిగా పనిచేశానన్న విషయాన్ని మరిచి తనతో దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని సీవీ షణ్ముగం మండిపడ్డారు. అరెస్టుల పేరిట వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement