అన్నాడీఎంకే పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యే వర్గం సంచలన ప్రకటన చేసింది. ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అలాగని ఇది పార్టీని చీల్చే ప్రయత్నం ఏమాత్రం కాదని ఆ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం తేల్చి చెప్పారు.
సీవీ షణ్ముగంలో నేతృత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు(24 మంది అని కొన్ని తమిళ మీడియా సంస్థలు చెబుతున్నాయ్) విజయ్‌కు మద్దతు ప్రకటించారు. తాము ఏ పదవులనూ ఆశించబోవడం లేదని.. బయటి నుంచే విజయ్ సర్కార్‌కు సపోర్ట్ ఇస్తామని అన్నారు. చెన్నైలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేలో అంతర్గత పోరు నిజమేనని ఆయన అంగీకరించారు.
‘‘విజయ్ ప్రజల సీఎం. ఆయన ఆ కుర్చీలో కూర్చోవాలని తమిళ ప్రజలు కోరుకున్నారు. ప్రజా నిర్ణయమే మాకు శిరోధార్యం. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని షణ్ముగం ప్రకటించారు.
అదే సమయంలో.. పార్టీ లుకలుకలను ఆయన మీడియాకు వివరించారు. డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళని స్వామి కుట్ర చేశారు. ఎలాగైనా ఆయన సీఎం కావాలని అనుకున్నారు. ఆ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదు. అన్నాడీఎంకే స్థాపన లక్ష్యం డీఎంకేను ఎదుర్కోవడం. అలాంటి పార్టీతో చేతులు కలపడం పార్టీ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమే కాదు.. అత్యంత ప్రమాదకరం కూడా.
ఈ విషయంలో పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పాం అని షణ్ముగం వివరించారు. వరుస ఓటములకు పళనినే కారణమన్న షణ్ముగం.. ఆయన అన్ని పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి మాదే అసలైన అన్నాడీఎంకే కూటమి.. ఎన్డీయేతో మాకు సంబంధం లేదు.. మేం బయటకు వచ్చేశాం. ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తాం అని స్పష్టం చేశారాయన. దీంతో పళనిస్వామి ఎలా స్పందిస్తారు? ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది?. కూటమి విచ్ఛిన్నంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో? అనే ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 53 సీట్లు నెగ్గింది. అన్నాడీఎంకే 47 స్థానాల్లో.. పీఎంకే 4, ఏఎంకే, బీజేపీలు చెరో సీటు చొప్పున నెగ్గాయి. అయితే ఫలితాల తర్వాత విజయ్‌కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. బీజేపీ మద్దతు నేపథ్యంతో పళనిస్వామి అందుకు ఒప్పుకోలేదు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ కంటే విజయ్‌కు మద్దతు పార్టీకి ప్రజల్లో సింపథీ క్రియేట్ చేస్తుందని.. రాబోయే రోజుల్లో అది పనికి వస్తుందని వాదించింది. అంతేకాదు..
ఆ పార్టీ తరఫున శాసనసభా పక్షనేత, ఉప నేత ఎంపికలోనూ ఈ వర్గపోరు మరింత ఉధృతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తనకు, తన అనుచర గణానికి ఆ పదవులు దక్కాలని పళనిస్వామి భావిస్తున్నారు. అయితే షణ్ముగం వర్గం మాత్రం సీనియర్ నేత ఎస్‌పీ వేలుమణికి శాసనసభా పక్ష నేత, డిప్యూటీ పదవిని జీ హరి, సీ భాస్కర్‌లలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే పోరు ముదిరి బయటకు వచ్చి ప్రకటన చేసింది. రేపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కొనుంది. ఈ తరుణంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన బూస్ట్ కానుంది.


