ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిల్లీ నుంచి బీహార్ వైపు వెళుతున్న ఒక ప్రైవేటు బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపు తప్పి బోల్తా పడటంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సు వేగంగా వెళ్తుండగా..
ఈ ప్రమాదం ఉన్నావ్ పరిధిలోని అరస్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, ఎక్స్‌ప్రెస్‌వేపై 262వ కిలోమీటర్ మైలురాయి వద్ద చోటుచేసుకుంది. బస్సు వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను వేగవంతం చేశాయి. గాయపడిన వారిని తక్షణమే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
బాధితుల్లో పోలీసు అధికారి, ఖైదీ
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒక సబ్ఇన్‌స్పెక్టర్, ఒక ఖైదీ ఉన్నట్లు అరస్ ఎస్.ఓ సంజీవ్ కుశ్వాహా తెలిపారు. మృతుడైన సబ్-ఇన్‌స్పెక్టర్‌ను రామచంద్రగా గుర్తించారు. ఆయన తన విధి నిర్వహణలో భాగంగా ఖైదీ ఛత్రపాల్‌ను సివాన్ నుంచి డిల్లీకి తీసుకెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
మెరుగైన చికిత్స కోసం లక్నోకు తరలింపు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను మెరుగైన వైద్యం కోసం లక్నోలోని ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. కాగా మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.


