
న్యూఢిల్లీ: దేశంలో నిర్వహించే ఎన్నికల్లో పారదర్శకత కోసం పోరాడిన ప్రొఫెసర్ జగదీప్ చోకర్(72) కన్నుమూశారు. ఆయన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వ్యవస్థాపక సభ్యుడు. ఎన్నికల రాజకీయాలను పారదర్శకంగా, జవాబుదారీగా మార్చడంలో ఏడీఆర్ చారిత్రాత్మక పాత్ర పోషించింది. ప్రొఫెసర్ చోకర్ చొరవతో సుప్రీంకోర్టు.. ఎన్నికల్లో అభ్యర్థులు నేర నేపథ్యం, ఆస్తులు, విద్యార్హతలను వెల్లడించడం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం భారత ప్రజాస్వామ్యంలో ఒక మైలురాయిలా నిలిచింది.
— ADR India & MyNeta (@adrspeaks) September 12, 2025
ప్రొఫెసర్ జగదీప్ చోకర్ 1967లో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. 1977లో డీయూ నుండి ఎంబీఏ పట్టా పొందారు. 1993లో లూసియానా స్టేట్ యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ, 2001లో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ నుండి ఆర్నిథాలజీలో సర్టిఫికేట్ అందుకున్నారు. 2005లో గుజరాత్ యూనివర్సిటీ నుండి ఎల్‌ఎల్‌బీ చేశారు. ఆయన 1985 నుండి 2006 వరకు ఐఐఎం అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
1999లో జగదీప్ చోకర్ తన సహచరులతో కలిసి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)కు పునాది వేశాడు. రాజకీయాల్లో పారదర్శకతను తీసుకురావడం మరియు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా దీనిని నెలకొల్పారు. ఏడీఆర్ ప్రయత్నాల మేరకు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆర్థిక సమాచారం, విద్యా వివరాలను తప్పనిసరిగా అందించాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో తీర్పు ఇచ్చింది.