
విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డిన కన్నడ నటి రన్యా రావు (Kannada Actor Ranya Rao) కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాన్నాళ్లుగా ఆమె ఈ దందా సాగిస్తున్నట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం అక్రమ రవాణాలో ఆమె కేవలం పాత్రధారి మాత్రమేనని సూత్రధారులు వేరే ఉన్నారని అనుమానిస్తున్నారు. రాజకీయ నేతల హస్తం కూడా ఉండొచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. పోలీసుల దర్యాప్తులో ఎవరి పేర్లు వెలుగులోకి వస్తాయోనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
సవతి తండ్రిపైనా ఆరోపణలు
రన్యా రావు అరెస్ట్ ఘటనలో తనకేం సంబంధం లేదని స్పష్టంచేసిన ఆమె సవతి తండ్రి కె.రామచంద్రరావు పైనా గతంలో ఆరోపణలున్నట్లు తాజాగా మీడియాలో వార్తలొచ్చాయి. ఐపీఎస్ అధికారి (IPS Officer) అయిన రామచంద్రరావు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్)గా సేవలందిస్తున్నారు. 2014లో మైసూరు సదరన్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిలో ఉన్నప్పుడు హవాలా కేసులో ఈయన పాత్ర ఉందని ఆనాడు ఆరోపణలు వచ్చాయి.
మైసూరులోని యెల్వాల్ నుంచి కేరళకు వెళ్తున్న బస్సును అడ్డగించిన పోలీసులు అందులోంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే వాస్తవానికి ఆ బస్సు నుంచి రూ.2.07 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని రూ.20లక్షలు మినహా మిగతా కరెన్సీ పంచుకున్నారని ఒక వ్యాపారి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఉదంతంపై కేసు నమోదైంది. బస్సు వెళ్తున్న మార్గం వివరాలను వెల్లడించిన పోలీస్ ఇన్ఫార్మర్లతోపాటు రామచంద్రరావు వ్యక్తిగత గన్‌మెన్‌ను అరెస్ట్‌చేశారు. దీంతో రామచంద్రరావును ఈ పోస్ట్ నుంచి తప్పించి హెడ్‌క్వార్టర్స్‌కు ట్రాన్స్‌ఫర్‌చేశారు.
తర్వాత రెండేళ్లకు మరో కేసులోనూ రామచంద్రరావు పేరు ప్రముఖంగా వినిపించింది. గ్యాంగ్‌స్టర్లు ధర్మరాజ్, గంగాధర్‌ల నకిలీ ఎన్‌కౌంటర్ కేసు (Fake Encounter Case)లో రామంచంద్రరావును సీఐడీ అధికారులు ప్రశ్నించారు.
చదవండి: రన్యా రావు నాలుగు నెలలుగా ఇంటికి రాలేదు
రన్యా రావుకు 3 రోజుల కస్టడీ
కర్ణాటకలోని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రాత్రి రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలు తెస్తూ రన్యా రావు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమెను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చేసిన విజ్ఞప్తిని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు శుక్రవారం అనుమతించింది.